ర్యాంకర్లకు `బాలా'రిష్టాలు
హైదరాబాద్ : అద్భుతమైన తెలివితేటలతో మంచి ర్యాంకులు సాధించుకున్నప్పటికీ సీట్లు తెచ్చుకోవడంలో వారికి `బాలా'రిష్టాలు తప్పడం లేదు. కేవలం రోజుల వ్యవధితో మెడిసిన్ సీటుకు అర్హత కోల్పోవడంతో తమకు న్యాయం చేయాలంటూ ఇద్దరు ర్యాంకర్లు ముఖ్యమంత్రిని ఆశ్రయించారు. వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ కేంద్ర నిబంధనలు అడ్డురావడంతో ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప వారికి మరో గత్యంతరం కనిపించడం లేదు. మెడిసిన్ ప్రవేశపరీక్షలో తొమ్మిదవ ర్యాంక్ సాధించిన విద్యార్థి సాయిరా, 452 ర్యాంకు సాధించిన దుర్గా శాంతిలక్ష్మిల వయసు చాలదంటూ వారికి సీట్లు ఇచ్చేందుకు అధికారులు తిరస్కరించారు.
సాయిరాం కు పదిహేను రోజులు, శాంతిలక్ష్మికి ఆరు రోజులు తక్కువ కావడంతో సీట్లు దక్కించుకోలేకపోయారు. మెడిసిన్ లోచేరాలంటే 17 ఏళ్ళ వయసు నిండి ఉండాలన్నది వైద్య మండలి నిబంధన కావడంతో, సాయిరాం, శాంతిలక్ష్మిలకు సీట్లు ఇచ్చేందుకు తిరస్కరించారు. దీనిపై వారు అన్నతాధికారులకు ఆశ్రయించి గోడు చెప్పుకోవడంతో ప్రత్యేక కేసుగా పరిగణనలోకి తీసుకుని సాయిరాంకు సీటు ఇవ్వాలంటూ విద్యాశాఖ 18న ఉత్తర్వులు జారీ చేయగా, శాంతిలక్ష్మికి సీటు ఇవ్వాలంటూ 21న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉస్మానియా యూనివర్శిటీలో సోమవారం జరిగిన కౌన్సెలింగ్ లో ర్యాంకర్లకు సీటు ఇచ్చేందుకు అధికారులు తిరస్కరించడంతో ఆ ఇద్దరూ తమకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రిని ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారికి తగిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీనిచ్చారు. కాగా, వారి సమక్షంలోనే మెడికల్ కౌన్సిల్ అధికారులతో ముఖ్యమంత్రి ఫోన్లో చర్చించగా, సీట్లు ఇచ్చే అవకాశాలు తమ చేతుల్లో లేవని, మెడికల్ కౌన్సిల్ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని అధికారులు వివరించినట్లు తెలిసింది. అలాగే సీట్లు ఇవ్వాలంటూ వారు కోర్టును ఆశ్రయించకోవచ్చునని, అటువంటి సమయంలో తాము వారికి వ్యతిరేకంగా మళ్ళీ పిటిషన్ వేయకుండా ఉంటామని ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది.
తక్కువ వయస్సు కారణంతో తనకు ఎంబిబిఎస్ సీటును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బిఎస్ కృపలాని అనే విద్యార్థి దాఖలు చేసిన రిట్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. కావలసిన వయస్సు కంటే తక్కువ ఉందన్న కారణంతో కృపలానీకి ఎంబిబిఎస్ సీటును నిరాకరించారు. విశ్వవిద్యాలయ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని మెరిట్ ను పరిగణనలోకి తీసుకోకుండా ఇటుంటి నిబంధనలను పాటించడం వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. కనీస వయసు అర్హత ఉండాలన్న నిబంధన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిందని, ఇందులో స్థానిక అధికారుల ప్రమేయం లేదంటూ జస్టిస్ రోహిణి ప్రకటించారు
News Posted: 22 July, 2009
|