జైలులో 'రాజు'ల హల్ చల్
హైదరాబాద్: సత్యం కుంభకోణం సూత్రదారులు రామలింగరాజు , అతని సోదరుడు రామరాజులు కారాగారంలో కూడా తమదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వారి జ్యుడిషియల్ కస్టడీని ఆగస్ట్ 5 వరకు న్యాయస్థానం బుధవారం పొడిగించింది. రాజు సోదరులు చెంచల్ గూడ జైలులో ఉన్నప్పటికీ వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కొనసాగించడానికి సెల్ ఫోన్ సౌకర్యం కూడా లభిస్తోందని ఆరోపణ ఉంది.
చెంచల్ గూడ జైలులో వారికన్నా సీనియర్ అయిన కృషి బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడైన కొసరాజు వేంకటేశ్వరరావు మార్గదర్శనం చేస్తున్నాడని ప్రచారంలో ఉంది. ఏ అధికారులతో ఎలా మసలుకుంటే ఏవిధంగా పనులయ్యేదీ రాజు సోదరులకు బోధించారని జైలు వర్గాలు చెప్పాయి. రాజు సోదరులకు సెల్ ఫోన్ సౌకర్యం ఉందన్న విషయమై జైలు సూపరింటెండెంట్ ఎం చంద్రశేఖర్ ని ప్రశ్నించగా, అటువంటిదేమీ లేదని స్పష్టం చేశారు. చట్టపరంగా కల్పించాల్సిన సౌకర్యాలే వారికి లభిస్తున్నాయని, సెల్ వంటివి వాడితే వారిని సులభంగా గుర్తించగలమని చెప్పారు.
News Posted: 23 July, 2009
|