తిరుమల శ్రీవారికి శిరోభారం
తిరుపతి: కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరస్వామికి తన భక్తులిచ్చే కిరీట కానుకలు 'శిరోభారం'గా మారుతున్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కళకళలాడే శ్రీవారికి ఇటీవల భక్తులు సమర్పించిన దానితో కలిపితే మొత్తం ఏడు కిరీటాలు అమరినట్టు. స్వామి వారికి శ్రీమంతులైన భక్తులు సమర్పించిన నగలు, బంగారం, వజ్రాలు అన్నీ కలిపి 11 టన్నుల మేరకు ఉన్నాయి. మిగతావాటి సంగతెలా ఉన్నా ఎక్కువ బరువున్న స్వామి వారి కిరీటాల గురించి ఆలయ పూజారులు, వేదపండితులు ఆందోళన చెందుతున్నారు.
ఏ రోజు చూసినా శ్రీవారి (8అడుగులు) మూల విరాట్ ను 60 నుంచి 70 కిలోల బంగారు నగల్ని అలంకరిస్తున్నారు. 30 కిలోల మించి నగలు అలంకరించడం వల్ల విగ్రహానికి పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని ఆలయానికి చెందిన అర్చకులొకరు తెలిపారు. విగ్రహానికి పగుళ్లను నివారించేందుకు దోహదపడే చందనంతోపాటు పుణుగు తైలం లభించక ఆలయవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
శ్రీవారికి చెన్నై భక్తుడొకరు రూ.7.5 కోట్ల విలువైన 20 కిలోల వజ్ర కిరీటాన్ని కొంతకాలం క్రితం కానుకగా సమర్పించారు. ఈ ఏడాది జూన్ లో 42 కోట్ల విలువైన 34 కిలోల వజ్ర కిరీటాన్ని కర్ణాటక మంత్రి గాలి జనార్దనరెడ్డి సమర్పించారు. ఇందులో 70,000 వజ్రాలతోపాటు 890 కేరట్ల పచ్చను పొదిగారు. రికార్డులు అధిగమించేందుకు అన్నట్టుగా భక్తులు ఒకరిని మించి ఒకరు ఎక్కువ బరువైన వజ్రకిరీటాలు కానుకగా ఇవ్వడం స్వామి భద్రతకు భారంగా మారిందన్న విషయాన్ని సున్నితంగా భక్తజనావళికి తెలపాల్సిన అవసరం ఉందని ఒక పూజారి పేర్కొన్నారు. ''స్వామివారిని అలంకరించడం కేవలం ఒక్క అర్చకస్వామికి సాధ్యం కాదు. ఈ సమయంలో ఏదైనా జరిగితే లక్షలాది భక్తుల హృదయాలు గాయపడతాయి.'' అని ఆందోళన వ్యక్తం చేశారు.
నిజానికి శ్రీవారికి ఈ 'తలనొప్పి' గతంలోనూ ఉంది. స్వామి వారికీ భారం తగ్గించి, విగ్రహాన్ని పరిరక్షించేందుకు 1986లో వజ్ర కిరీటాన్ని రీమోడలింగ్ చేశారు. అప్పట్లో 20 కిలోలున్న కిరీట భారాన్ని 13 కిలోలకు తగ్గించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం రిటైర్ట్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ వ్యవహారంలో బంగారం, వజ్రాలతో రూపొందించిన పెద్ద కిరీటాలు కానుకలుగా ఇవ్వొద్దని ప్రపంచంలోని వెంకన్న భక్తులకు టీటీడీ విన్నవించాలని సూచించారు.
News Posted: 23 July, 2009
|