మంత్రులూ! బహుపరాక్
హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై మంత్రులు, అధికారులు సమగ్ర సమాచారాన్ని అందజేయాలని, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచించారు. గురువారం మినీ కాబినెట్ గా నిర్వహించిన సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో శాసనసభ వ్యవహారాలు, ప్రజాసమస్యలపై తీసుకోవాల్సిన చర్యలు, మంత్రులు విప్ లకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని, మిగిలిన పార్టీలను ప్రతిపక్షాలుగా ఉండాలని సూచించారని చెబుతూ ప్రతిపక్షాలు అటువంటి క్రియాశీలక పాత్రను పోషించడం లేదని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా మొత్తం 294 మంది సభ్యులు ప్రజల సమస్యను పరిష్కరించేందుకు శాసనసభను వినియోగించుకోవాలని సూచించారు. గడచిన ఐదేళ్ళుగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను, అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పై విశ్వాసాన్ని పెంపొందించుకుని గెలిపించారని గుర్తుచేశారు. గత ఐదేళ్ళుగా నిందారోపణలతోనే కాలం నెట్టుకు వచ్చిన ప్రధాన ప్రతిపక్షనేత చివరకు సభను తానే స్వయంగా పక్కదోవ పట్టించినట్లు ఒకానొక సందర్భంగా అంగీకరించడం గమనిస్తే దేశంలో అటువంటి వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమేనని అభివర్ణించారు.
ఇక అధికారులు కూడా శాసనసభను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిపక్షాలు ప్రతి చిన్న అంశాన్ని వేలెత్తి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల అన్ని అంశాలపై సమగ్ర సమాచారాన్ని అధికారులు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మంత్రులకు కూడా వివరాలను ఎప్పటికప్పుడు అందించాలని స్పష్టం చేశారు. శాసనసభలో విప్ లు అత్యంత కీలక బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని, వారికి కూడా సమగ్ర సమాచారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రులకు, విప్ లకు అందుబాటులో ఉండేందుకు అన్ని శాఖలు నోడల్ అధికారులుగా ముఖ్యమైన వారిని అందుబాటులో ఉంచాలని కూడా వైఎస్ ఆదేశించారు. అలాగే వివిధ సమస్యలపై పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా అధికారులు చదివి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సిద్ధం చేసుకోవాలని, మంత్రులు కూడా వారి వారి జిల్లా పత్రికల్లో వచ్చిన వార్తలపై దృష్టి పెట్టాలని సూచించారు. జీరో అవర్ లో వచ్చిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను మంత్రుల పేరుపై వారం రోజుల్లోగా సభ్యులకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
శాసనసభలో అనేక ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయని వాటికి సమాధానాలు చెప్పేందుకు కూడా సిద్ధం కావాలని మంత్రులు, అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సమస్య కూడా శాసనసభలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. మొత్తం మీద ఏ అంశం చర్చకు వచ్చినా సమర్ధవంతంగా సమాధానాలు చెప్పేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ఆర్తికమంత్రి కె.రోశయ్య, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు దాదాపు మంత్రి వర్గ సహచరులుంతా పాల్గొనగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి, అన్ని శాఖల అధిపతులు పాల్గొన్నారు.
News Posted: 24 July, 2009
|