ఒంటరి పోరే : కేసీఆర్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లకు ఒంటరిగానే పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తెలంగాణభవన్ లో ఆదివారం గ్రేటర్ ఎన్నికల వ్యూహ రచనపై జరిగిన సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. టిఆర్ఎస్ నాయకత్వాన్ని బలహీనపర్చాలని కాంగ్రెస్, టిడిపి రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయనిఆయన ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణ వాదాన్ని దెబ్బతీయడానికి ఏ విధంగా కుట్రలు పన్నుతున్నాయో బస్తీల్లో ప్రజలకు వివరించాలని ఆయన చెప్పారు. తాను స్వయంగా బస్తీలకు వెళ్ళి ప్రచారాన్ని చేస్తానని ఆయన తెలిపారు. గత నెల రోజులుగా ఆరోగ్య సమస్యలు, ఆషాడమాసం కారణంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండగా, ఇదే ఆసరాగా చేసుకుని కాంగ్రెస్, టిడిపిలు తెలంగాణ ఉద్యమాన్ని, టిఆర్ఎస్ పార్టీని బలహీన పరచేందుకు కుట్రలు చేశాయని ఆయన ఆరోపించారు.
తాను ఇంతకాలం మౌనంగా ఉండటంతో తెలంగాణపై ఏ పార్టీ ఏమి చేస్తుందో గమనించే అవకాశం లభించదని ఆయన పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమాలు చేయకుండా టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాన్ని వెనక్కి నెట్టుతుందని కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారని, ఉద్యమాలు చేయనిదే టిఆర్ఎస్ ను ప్రజలు ఈ స్థాయికి తీసుకొచ్చారా అని ఆయన ప్రశ్నించారు.
ఏ ఉద్యమానికైనా ఆటుపోటులు తప్పవని వాటిని ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్లడమే ఉద్యమకారుల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ ను స్థాపించినప్పుడు ఇది ఆరునెలల్లో మూతపడుతుందని ఎద్దేవా చేసిన టిడిపి అధినేత బాబూయే చివరికి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే పరిస్థితికి తీసుకురాగలిగామని కేసీఆర్ గుర్తు చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే ప్రథమ శతృవు అని, సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడానికి టిడిపితో చేతులు కలిపితే, ఆపార్టీయే టిఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచిందన్నారు. ఆ అనుభవంతో గ్రేటర్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో టిడిపితో పొత్తు పెట్టుకోరాదని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
News Posted: 27 July, 2009
|