భద్రాద్రిలో అభినవ భక్త కబీర్
భద్రాచలం: గోల్కొండ నవాబు తానీషాకు రామ దర్శనం మాటేమో కానీ, నాదస్వర విద్వాంసులైన తండ్రీకొడుకులిద్దరు భద్రాద్రి శ్రీరాముని సేవలో నిత్యం తరిస్తున్నారు. భద్రాచలం ఆలయంలో సుప్రభాతం సేవ మొదలుకొని.. పవ్వళింపు సేవ వరకు వారిద్దరూ స్వామి సేవలోనే ఉండటం విశేషం. స్వామివారికి వివిధ సేవల్లో పాల్గొనే భక్తావళికి నాదస్వరం శ్రావ్యంగా వినిపించడం ప్రారంభమై అర్థ శతాబ్దం దాటింది. గోసవీడు హసన్ సాహెబ్ 1953 నుంచి స్వామికి నాదస్వర సేవకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి స్వామి సేవల్లో తరిస్తున్న ఆయన 1978లో ఒకసారి తిరుమలలో వేంకటేశ్వరస్వామికి కూడా నాదస్వరార్చన చేశారు. దక్షిణాదిలో విద్వాంసునిగా ఖ్యాతి గాంచిన హసన్ ఆలయసేవల్లో తప్ప మరెక్కడా నాదస్వర కచేరీ చేయలేదు. భాగవతాన్ని రాజులకు అంకితం ఇవ్వనన్న భక్తపోతన ఉదంతాన్ని హసన్ సేవ గుర్తు చేస్తున్నది. స్వామికి సేవ చేయడం ప్రారంభమైన మూడు దశాబ్దాలకు ఆయనను ఆలయ నాదస్వర విద్వాంసునిగా గుర్తించారు.
హసన్ తోపాటు ఆయన కుమారుడు ఖాసీంబాబు కూడా నాదస్వర సేవలో తరిస్తున్నారు. వేకువఝామున 4.30గంటలకు శ్రీరాముని అభిషేకానికి నీటిని కుండలో తెచ్చి, నాదస్వరాన్ని ఊదడంతో తండ్రీకొడుకుల సేవావిధి మొదలౌతుంది. ప్రభుత్వం సొమ్ముతో శ్రీరామునికి గుడి కట్టించారన్న ఆరోపణతో భక్త రామదాసును ఖైదు చేసిన గోల్కొండ నవాబుకు రామదర్శనం లభించిందని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఏటా శ్రీరామ నవమికి ముత్యాల తలంబ్రాలను భద్రాచలం పంపటం ఆనవాయితీగా మారింది. ఈ ఆచారాన్ని నేటి ప్రజా ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి. హసన్, ఆయన కుమారుడి సేవలు భక్తులకు ఆనాటి భక్త కబీర్, తానీషాల భక్తిప్రపత్తుల్ని గుర్తుకు తెస్తాయంటే అతిశయోక్తి కాదు.
News Posted: 29 July, 2009
|