'ఆగస్ట్' పై దగ్గుబాటి నిజాలు
దరాబాద్: ఆంధ్రుల అభిమాన నటుడు, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత విశేషాలు మరోసారి 'ఆగస్ట్'లో ప్రజల్లో చర్చనీయాంశం కానున్నాయి. రాష్ట్రంలో ఏకపక్షం రాజకీయాలకు 1983లో సమాధి కట్టిన రామారావుకు ప్రజల్లో గల ఆదరణ ఈనాటికీ చెక్కు చెదరలేదు. నందమూరి జీవితపు చరమాంకంలో జరిగిన సంఘటనలు.. 1995లో ఆగస్ట్ సంక్షోభం, మృతికి దారి తీసిన పరిస్థితులపై ఆయన పెద్దల్లుడు.. కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు 200 పేజీల్లో గ్రంథం 'ఒక చరిత్ర- కొన్ని నిజాలు' ఆగస్ట్ లో విడుదల చేయనున్నారు. ఇందులో ఆనాటి సంఘటనలు, వాటి వెనుక నీడలు.. నిజాలను ప్రస్తావించనున్నారు.
ఆగస్ట్ సంక్షోభంలో ముఖ్యమంత్రి పదవి నుంచి.. చివరకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి కూడా అభిమాన ధనుడు.. ఎన్టీఆర్ ను దించివేయడంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు పెద్దల్లుడు వేంకటేశ్వరరావు పాత్ర కూడా ఉంది. అప్పట్లో తెదేపాలో చంద్రబాబు తరువాత స్థానంలో వెలిగిన దగ్గుబాటి క్రమేణా కనుమరుగయ్యారు. చివరకు పార్టీకి దూరమయ్యారు. కొంతకాలం భాజపాలో కూడా పని చేసిన ఆయన 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటివరకు వ్యతిరేకించిన కాంగ్రెస్ లో దగ్గుబాటి, ఆయన భార్య పురంధేశ్వరి చేరడం.. వారి వర్గానికే కాక, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే, అనివార్య పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో దగ్గుబాటి వివరించారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నిజమైన వారసుడు వై.ఎస్.. అని, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి జీవించి ఉంటే.. చంద్రబాబును ఓడించేందుకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేవారని... పురంధేశ్వరి వ్యాఖ్యానించడం తెలుగుదేశం వర్గాలకు మనస్థాపం కలిగించింది. ప్రతిగా విమర్శలు గుప్పించేందుకు ఆమె నందమూరి కుమార్తె కావడం ప్రతిబంధకంగా మారింది. 2009 ఎన్నికల వేళ చంద్రబాబు వైఖరి.. తదితర అంశాలపై పురంధేశ్వరి లేఖ రాయడం, ఎన్నికల ప్రచారంలో కారంచేడు వెళ్లిన బాలకృష్ణ తన బావ ఇంటి ముందు అభిమానుల కోరికపై తొడ గొట్టడం కూడా ఉభయ వర్గాల మధ్య దూరాన్ని పెంచింది.
దీనికి ఇటీవల కారంచేడులో తమ సర్పంచ్ పై ఎస్ సీ, ఎస్ టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం చేపట్టిన ఉద్యమం కూడా దగ్గుబాటి కేంద్రంగా సాగింది. ఈ సమయంలోనే ఎంఎల్సీ రాజకుమారిపై జరిగిన దాడిని నిరసిస్తూ తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి 'ఆగస్ట్ సంక్షోభాన్ని' దగ్గుబాటి తన పుస్తకం ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. తద్వారా తెలుగుదేశం కుటుంబ రాజకీయాలు మరోసారి 'రచ్చ'కెక్కే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
News Posted: 29 July, 2009
|