`నానో'కు నో...నో
హైదరాబాద్ : నానో కారు మోజు రోజురజుకు తగ్గిపోతోంది. ఖరీదు తక్కువ బుల్లి కారు కోసం వెల్లువలా వచ్చి పడిన జనం ఇప్పుడు వెనక్కి పోతున్నారు. బ్యాంకుల్లో వేల రూపాయలు చెల్లించి కారును బుక్ చేసుకున్న వారంతా తమ ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నారు. టాటా మోటారు కంపెనీ ఈ కారును బట్వాడా చేయడానికి నెలల కొద్దీ సమయం తీసుకోవడమే ఆర్డర్ల రద్దుకు కారణమని హైదరాబాద్ నగరంలోని టాటా డీలర్లు చెబుతున్నారు. నగరంలో గడిచిన పక్షం రోజుల్లోనే దాదాపు వంద మందికి పైగా నానో మోజుపరులు తమ ఆర్డర్లను రద్దు చేసుకున్నారు. మొదటి విడత లాటరీ ద్వారా కార్లను కేటాయించిన టాటా మోటారు కంపెనీ తరువాత కార్ల విడుదలకు సంవత్సరం పైగా సమయం తీసుకోవడం జనాలకు నచ్చలేదని, అంతవరకూ కారు కోసం వేచిచూడటానికి వారు ఇష్టపడటం లేదని డీలర్లు చెబుతున్నారు.
టాటా బుకింగ్ ప్రారంభించగానే డిపాజిట్లు చెల్లించిన వారికి 2010 సంవత్సరాంతానికి కారులు వస్తాయని భావించారు. కాని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే 2011 ప్రారంభ త్రైమాసికం వరకూ ఎదురు చూడాల్సి వచ్చేలా ఉందని, ఇంకా ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. రాజేంద్రనగర్ లోని ఒక బ్యాంకు ద్వారా నానో ను బుక్ చేసుకున్న వాణిశ్రీ తన ఆర్డర్ ను రద్దు చేసుకున్నారు. ఈ బ్యాంకులో డిపాజిట్ కట్టిన ఎనిమిది మందిలో ఐదుగురం డబ్బులను వాపసు తీసుకున్నామని ఆమె తెలిపారు. కారులు త్వరగా రావని తేలిపోయింది. అప్పటి వరకూ ఎదురుచూసే ఓపిక లేదని ఆమె వివరించారు. కార్ల డెలివరీ డేట్ల గురించి ప్రతీ రోజు వందలాది టెలిఫోన్ కాల్స్ వస్తున్నాయని, వారికి నచ్చచెప్పడానికి తలప్రాణం తోక కొస్తుందని టాటా డీలర్ ఒకరు వాపోయారు.
కాగా ముందుగానే కారు బుక్ చేసుకునే వారికి షరతు పెట్టామని టాటా మోటార్స్ సేల్స్ విభాగం ఉద్యోగి వివరించారు. కారును కేటాయించే వరకూ వేచి ఉంటారా? లేదా రద్దుచేసుకుంటారా? అన్న షరతులో 67 శాతం మంది కారు ఇచ్చేవరకూ వేచి ఉండటానికే ఇష్టపడ్డారని, ఈ రద్దుల వల్ల పెద్దగా వచ్చే నష్టం లేదని వివరిస్తున్నారు. నానో కోసం సంవత్సరాలు తరబడి వేచి చూసే కంటే మరో 60 వేలు అదనంగా చెల్లిస్తే ఇప్పుడే మారుతీ-800 కొనుక్కోవచ్చునని ఒక వినియోగదారుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు.
News Posted: 29 July, 2009
|