వైఎస్ రికార్డు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి నెలకొల్పిన రికార్డులు బద్దలు కొట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ లో రెండోసారి వరుసగా ముఖ్యమంత్రైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలన్న కాసు ఆశయాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఇటీవల జరిగిన కాసు బ్రహ్మానందరెడ్డి శత జయంత్యుత్సవాల్లో వైఎస్ ప్రకటించారు. 1964-70 మధ్య సీఎంగా ఉన్న కాసు .. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించారు. దీని కోసం జరిగిన ఉద్యమంలో 35 మంది బలిదానం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మరో రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. ఈ కాలంలో తలెత్తిన శ్రీకాకుళం నక్సల్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమాలను సమర్థంగా కాసు అణచివేశారు.
తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు, వారు స్థాపించిన తెలంగాణ ప్రజాసమితి కాసు పీఠాన్ని ఏ మాత్రం కదిలించలేక పోయాయి. మర్రి చెన్నారెడ్డి, జి. వెంకటస్వామి, మదన్ మోహన్ తదితరులు ఎంతగా డిమాండ్ చేసినా కూడా సీఎం పదవి నుంచి కాసును అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తొలగించలేదు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో 350 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ ప్రజాసమితి స్థాపించిన చెన్నారెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసే వరకు తెలంగాణ ఉద్యమం ఊసు లేదు. కాసు హయాంలోలాగే తెలంగాణ ఉద్యమాన్ని వైఎస్ నిర్వీర్యం చేయగలిగారు.
ఇదే తరహాలో నక్సల్ ఉద్యమానికి వస్తే శ్రీకాకుళంలో ఉద్యమించిన సీపీఐఎంఎల్ ను అప్పటి రాష్ట్ర హోం మంత్రి జలగం వెంగళరావు సమర్థంగా అణచివేశారు. ఆనాటి ఎన్ కౌంటర్లలో ఉద్యమ అగ్రనేతలను కాల్పించారన్న ఖ్యాతి జలగంకు ఉంది. 2004లో తొలిసారిగా సీఎం అయిన వైఎస్ చర్చలకు నక్సల్స్ ను ఆహ్వానించడమే కాకుండా, చర్చల అనంతరం వారిని ఉక్కుపాదంతో అణచివేశారు. 2009 సాధారణ ఎన్నికల నాటికి తాము నక్సల్ సమస్యను ఆర్థిక విధానాలతో పరిష్కరించామని చెప్పగలిగారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు అనుసరించిన విధానం నక్సల్ సమస్య పీడిత రాష్ట్రాలకు అనుసరణీయంగా మారింది.
గ్రామస్థాయిలో కూడా కాసుకు బలగం ఉన్నప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ లో ముఠాలను నివారించడంలో విఫలమయ్యారు. కానీ, రాష్ట్ర కాంగ్రెస్ లో ముఠాల విషయంలో వైఎస్ ఎంతో అదృష్లవంతుడనే చెప్పాలి. ప్రస్తుతం వైఎస్ ను వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను కాదని వ్యవహరించే పరిస్థితి లేదు. 2004 కన్నా కాంగ్రెస్ కు స్థానాలు తగ్గినప్పటికీ, ప్రతిపక్షం ఎంత బలంగా ఉన్నప్పటికీ.. సీఎంలను తరచూ మార్సే విధానానికి ఢిల్లీ అధిష్టానం విరామం కూడా వైఎస్ కు కలిసివచ్చిందనే చెప్పాలి.
News Posted: 30 July, 2009
|