జంప్ లతో 'చిరు' చింత!
హైదరాబాద్: రాష్ట్రంలో మార్పు కోసం వచ్చామన్న ప్రజారాజ్యంలో నేతలు పార్టీ మార్పిడి బాట పట్టారు. తెలుగుదేశంలో చేరేందుకు దేవేందర్ గౌడ్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకోగా, ప్రజారాజ్యం నుంచి తిరుగుముఖం పట్టిన నేతల జాబితాలో ప్రముఖ నటుడు కృష్ణంరాజు చేరారు. దీంతో 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యంలో చేరిన నేతలంతా వీడ్కోలు నిర్ణయం తీసుకున్నట్టైంది.
రక్తదానం, తదితర కార్యక్రమాలతో ప్రజల ఆదరాభిమానాలు పొందిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశంతో ప్రత్యర్థులైన రాజకీయ పక్షాల్లో దడ పుట్టించారు. ఎన్నికల ఫలితాల్లో ఎవరి పుట్టిని ప్రజారాజ్యం ముంచుతుందోనని ప్రధాన రాజకీయ పక్షాలు ఆందోళన చెందాయి. చివరకు ప్రజారాజ్యం ప్రభావంతో అధికార పీఠానికి తెలుగుదేశం చేరువ కాలేకపోయింది. ఠాగూర్, స్టాలిన్ గా ప్రేక్షకుల మన్నన పొందిన చిరుకు గల ప్రజాదరణ చూసిన నేతలు ప్రజారాజ్యంతో మరోసారి 1983నాటి చరిత్ర ఆవిష్కృతమౌతుందని అంచనాలు వేశారు. చిరుకు చెందిన సామాజికవర్గం నేతలు చిరంజీవి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని భావించారు. మెగా పర్యటనల్లో జన సందోహాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు.
కాంగ్రెస్ నుంచి కూడా పీఆర్పీలోకి వలసలు కొనసాగినా.. ప్రతిపక్షం తెలుగుదేశం నుంచి ఎక్కువగా వలసలు సాగాయి. సీనియర్ నేత చేగొండి హరిరామ జోగయ్య కాంగ్రెస్ లోనే ఉండి చిరంజీవి పాట పాడారు. కాంగ్రెస్ పై లేఖాస్త్రాలు సంధించి.. సస్పెండయ్యారు. ప్రరాపా ఆవిర్భవంలో తమ వంతు పాత్ర పోషించారు. కోటగిరి విద్యాధరరావు వంటి నేతలైతే ప్రజారాజ్యం ఏర్పడక ముందే తెలుగుదేశానికి రాజీనామా చేశారు. మెగా ప్రభంజనం తీవ్రతకు తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రాలేదన్న భావన, తమ భవిష్యత్ పట్ల ఆందోళనతో ఎక్కువమంది తెదేపా నేతలు పోలోమంటూ ప్రజారాజ్యంలో చేరారు. ఇతర పార్టీల నుంచి సీనియర్ నాయకులు ప్రజారాజ్యంలో చేరడాన్ని చిరంజీవి సన్నిహితులైన మిత్రా వంటివారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీరు 'కొత్త సీసాలో పాత సారా' కాగలదని హెచ్చరించారు. అయితే.. సామాజిక మార్పు లక్ష్యానికి సీనియర్ల మార్గదర్శనం తోడ్పడుతుందని చిరంజీవి సూత్రీకరించారు.
రాజకీయ విశ్లషకుల అంచనాలను పటాపంచలు చేస్తూ వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఇంద్రకు పదవి దక్కలేదు. ఆయన 'అందరివాడు నుంచి కొందరివాడు'గా మిగిలారు. పీఆర్పీకి 18 శాసన సభాస్థానాలే దక్కడం పార్టీవర్గాల్లో నైరాశ్యాన్ని నింపింది. తెలుగుదేశాన్ని నెలకొల్పిన 9 నెలలకే అధికారంలోకి రావడం ద్వారా ఎన్టీఆర్ నెలకొల్పిన 'రికార్డు'ను పీఆర్పీ 'తిరగరాయనందు'కు చిరంజీవితోపాటు ఆ పార్టీలోని మాజీ తెలుగుదేశం నాయకులు చింతించారు. ఎన్నికల అనంతరం కూడా ప్రజారాజ్యానికి రాజకీయ పార్టీకి ఉండాల్సిన విధి విధానాలు అబ్బకపోవడంతో ఇతర పార్టీల నుంచి వెళ్లిన సీనియర్లలో కలవరం మొదలైంది. 2014 వరకు ప్రజారాజ్యం పార్టీగా కొనసాగగలదా అన్న సందేహం అంతకంతకూ పెరిగింది. మరోవైపు 2004 నాటికన్నా రెట్టింపుగా 90 స్థానాలు గెలిచిన తెలుగుదేశం సమర్థ ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని పొందింది.
ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు అధికార పక్షం 'ఆపరేషన్ ఆకర్ష్'ను ప్రయోగించింది. ఈ లోటును పూరించేందుకు మాజీలను ఆహ్వానించాలన్న తెదేపా నిర్ణయం ప్రజారాజ్యంలోని సీనియర్లకు ఆయాచిత వరమైంది. తెలుగుదేశంలో ఉండగా 'నెంబర్ టూ'గా మన్ననలు పొందిన దేవేందర్ ఎన్నికల్లో ఓటమి పరాభవం ఎదురైంది. తెదేపాను వీడిన తరువాత ఆయన ఏర్పాటు చేసిన 'నవ తెలంగాణ పార్టీ'ని ఎన్నికల ముందు ప్రరాపాలో విలీనం చేశారు. దీంతో తమ నేత 'రెంటికీ చెడిన తీరైంద'ని దేవేందర్ అనుచరవర్గం కలత చెందింది. ప్రరాపా కనీసం మూడో ప్రత్యామ్నాయమైనా కాలేకపోయిందని దేవేందర్ తోపాటు ప్రరాపాలో చేరిన పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దరిమిలా దేవేందర్ చూపు పాత ఆశ్రయం వైపు పారింది. అల్లు అరవింద్ ను కలిసి తన భావి మార్గాన్ని తెలిపిన దేవేందర్ ఈ వారంలో తన నిష్క్రమణను ప్రకటించే అవకాశాలున్నాయి.
దేవేందర్ సృష్టించిన కలకలం నుంచి పీఆర్పీ వర్గాలు తేరుకోక మునుపే.. ఉరుము లేని పిడుగుపాటులా నటుడు కృష్ణంరాజు ప్రరాపాకు రాజీనామా చేశారు. తనను పార్టీ వినియోగించుకోలేదని, పార్టీకి తాను ఉపయోగపడని దశలో రాజీనామా చేసినట్టు ఆయన చెప్పారు. పీఆర్పీలో సీనియర్ నేతలు కోటగిరి విద్యాధరరావు, తమ్మినేని సీతారాం, కళా వెంకట్రావు వంటివారు కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీరంతా తమ భావి కార్యాచరణకై అనుచరవర్గాలతో సంప్రతింపులు జరుపుతున్నారని సమాచారం. వీరంతా తిరిగి 'స్వగృహ ప్రవేశం' చేస్తారని ఊహాగానాలున్నాయి.
శాసనసభ్యులు శోభానాగిరెడ్డి దంపతులు కూడా ప్రరాపాను వీడే అవకాశాలున్నాయని విశ్లేషకుల అంచనా. వీరు.. కాంగ్రెస్ లో చేరతారా లేక పూర్వాశ్రయం తెదేపాలో చేరతారా అన్నది నిర్ణయమైనట్టు కనిపించడం లేదు. శోభానాగిరెడ్డి వస్తే స్వాగతిస్తామని తెదేపా నేత నాగం జనార్దనరెడ్డి ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు కూడా! చిరు సామాజికవర్గానికి చెందిన శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, కె. కన్నబాబులు మాత్రం ఇంకా తమ భవితవ్యంపై దృష్టి పెట్టినట్టు కనిపించలేదు.
పార్టీ ఆవిర్భవం నుంచి పని చేసిన మిత్రా, పరకాల ప్రభాకర్ వంటి వారు కూడా ఇప్పటికే ప్రరాపాను వీడారు. పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. పార్టీని గ్రామస్థాయిలో పటిష్ఠం చేసేందుకు రాష్ట్రంలో పర్యటనలు చేయాలని చిరంజీవి తలపోస్తున్నారు. ఇది ఏ మేరకు ప్రరాపాను రాజకీయ పార్టీగా వచ్చే ఎన్నికల వరకు నిలుపుతుందో కాలమే నిర్ణయించాలి.
News Posted: 31 July, 2009
|