చరణ్, నాగచైతన్యల పోరు!
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి వారసుల మధ్య 'ప్రచ్ఛన్న యుద్ధం' నడుస్తోంది. అగ్రహీరోగా వెలిగిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశంతో 'లవర్ బోయ్' నాగార్జున మెగాస్థానాన్ని భర్తీ చేస్తారని కొందరు అంచనా వేశారు. సినీ సీమలో అగ్రనటులుగా కొనసాగిన చిరు, నాగ్ ల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. అయితే, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి, కాంగ్రెస్ తో తలపడ్డారు. నాగ్ మాత్రం వైఎస్ ప్రభుత్వ కార్యక్రమాలపై తీసిన చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కుమారుడు 25 ఏళ్ల రామ్ చరణ్ తేజ తన రెండో చిత్రం 'మగధీర'తో పరిశ్రమలో తన స్థానాన్ని 'పదిలం' చేసుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత అల్లు అరవిందే. మగధీరను ఇంటా బయటా హిట్ చేసేందుకు మొత్తం 1200 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో నాగార్జున కుమారుడు 24 ఏళ్ల నాగచైతన్య తొలి చిత్రం 'జోష్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు.
ఎన్నికల సమయంలో చిరు, నాగ్ ల మధ్య ఏర్పడిన 'అంతరం' .. చిత్రపరిశ్రమకూ విస్తరించిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్ 28న 'మగధీర' ఆడియో కార్యక్రమానికి నాగార్జున దూరంగా ఉన్నారు. ఆ రోజు విజయవాడలో జరిగిన సుశాంత్ .. 'కరెంట్' చిత్రం కార్యక్రమంలో నాగ్ పాల్గొన్నారు. జులై 18న నాగ చైతన్య చిత్రం 'జోష్' ఆడియో ఆవిష్కారానికి చిరంజీవి దూరంగా ఉన్నారు. ఆ రోజు తన నియోజకవర్గం తిరుపతిలో బిజీగా పర్యటించిన చిరు.. ఆడియో కార్యక్రమానికి వీడియో సందేశాన్ని పంపారు. తద్వారా తమ మధ్య దూరం లేదని చెప్పడానికి ఆయన ప్రయత్నించారు. ''చిరంజీవి, నాగార్జునలు తమ వారసులు చిత్రసీమలో సుస్థిరం కావాలని కోరుకోవడం.. సహజం. వారి వారసుల సినిమాల విడుదల అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది'' అని ఒక నిర్మాత వ్యాఖ్యానించారు.
News Posted: 31 July, 2009
|