100 నోటుతో జర జాగ్రత్త!
న్యూఢిల్లీ: దుకాణాల్లో, ఇతరత్రా చెల్లింపుల కోసం రూ. 500 నోటు ఇవ్వండి. అతను మీ వంక ఎగాదిగా చూసి ఆ నోటును శల్యపరీక్ష చేసి కాని తీసుకోరు. అదే మీరు రూ.100 నోటు ఇస్తే .. దాని వంక చూడకుండానే గల్లా పెట్టెలో వేసుకుంటారు. నిజానికి.. దేశంలో రూ.500 కన్నా రూ.100నోట్లే నకిలీవి ఎక్కువగా పట్టుబడుతున్నట్టు ఇటీవల రాజ్యసభలో ప్రభుత్వం తెలిపింది. 2006 నుంచి ఈ ఏడాది మే వరకు రూ.500 నోట్లు 5,76 లక్షలు, రూ. 1000 నోట్లు 1.09 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, రూ.100 నోట్లు నకిలీవి ఎక్కువగా చలామణీలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నోట్ల విషయంలో రిజర్వ్ బ్యాంకు అనేక జాగ్రత్తలు 2005లో తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2007, 2008, 2009 మార్చి వరకు వరుసగా రూ.10.54, రూ.21.45, రూ.4.09 కోట్లు విలువైన నకిలీ నోట్లను నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. పాక్ నిఘా సంస్థ ఆదేశాలకు అనుగుణంగా భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడంతోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ మొత్తాల్ని నోటుమార్పిడిదారులు వాడుతున్నారని అధికారుల విశ్లేషణ. ఇందుకు దావూద్ ఇబ్రహీం ముఠాను పాకిస్థాన్ నిఘా వర్గాలు వినియోగించుకుంటున్నాయని తెలిసింది.
అయితే, చలామణీలో ఉన్న నకిలీ నోట్ల గురించి ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం లేదు. 2000 సంవత్సరం వరకు రూ.1,69,000 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ చలామణి జరిగిందని 2005లో సీబీఐ అంచనా వేయగా, ఆర్ బీఐ ఖండించింది. చలామణిలోని నోట్ల గురించి ఏ సంస్థా అంచనా వేయలేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒక్క ఏడాదే రూ.67లక్షలు విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్ ఎఫ్ జనరల్ డైరెక్టర్ ఎం.ఎల్.కుమావత్ ప్రకటించారు. నకిలీ నోట్లను అరికట్టేందుకు బహుముఖ వ్యూహం అవసరమన్నారు.
News Posted: 1 August, 2009
|