చిరు ఇమేజ్ చాలలేదా?
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన 'మగధీర' చిత్రం సాధించిన విజయం రాజకీయ విశ్లేషకుల్లో కొత్త చర్చకు తెర తీసింది. 'మగధీర' ప్రదర్శించిన ధియేటర్ల వద్ద చిరు అభిమానుల సందడి చెప్పనలవి కాదు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో చిరు అన్నయ్య కోసం ఊహించినంతగా వారు పని చేయలేదా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. చిరు రాజకీయ ప్రవేశంతో మరోమారు రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతాయని ఊహించారు. కానీ, 'ప్రజారాజ్యం' నామమాత్రంగానే ప్రభావం చూపడంతో అందరి అంచనాలు తారుమారయ్యాయి. కానీ, అభిమానులకు ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వని కారణంగానే వారు ఉత్సాహంగా పని చేయలేదని భావిస్తున్నారు. అయితే ఈ వాదనను అభిమాన సంఘాల నేతలు ఖండించారు. చిరంజీవి అభిమానులంతా ప్రజారాజ్యానికే ఓటేశారని చెబుతున్నారు. అభిమానుల్ని వేరే పార్టీల నేతలు కొనుగోలు చేయలేరని సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. తిరుపతిలో చిరు అభిమానులు పని చేసిన విధంగా రాష్ట్రంలో మరెక్కడా పని చేయలేదన్న భావన ఉంది. రాష్ట్రంలో ఇతర చోట్ల పోటీ చేసింది తమ అభిమాన నటుడు కాదు కనుక చిరు అభిమానులు బాగా కనిపించి ఉండకపోవచ్చునని నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.
News Posted: 2 August, 2009
|