నాడు జేజేలు...నేడు జైలు
రాయపూర్ : ఒకప్పుడు క్రీడా మైదానంలో ఆమె సాధించిన విజయాలకు జనం జేజేలు పలికారు. ఆమె ప్రదర్శించిన అద్భుత ప్రతిభా పాటవాలకు నీరాజనాలు పట్టారు. ఇప్పుడు బతకడం కోసం శీలాన్ని అమ్ముకుంటున్న నేరానికి జైల్లో పెట్టారు. ఈ భారతదేశంలో క్రికెటేతర క్రీడాకారులను దక్కుతున్న ఆదరణను వివరించడానికి ఇదో దయనీయమైన కన్నీటి కథ. పేదరికం కాటుకు ఆ జాతీయ స్థాయి క్రీడాకారిణి సెక్స్ వర్కర్ గా మారిపోయింది. రాయపూర్ లోని విలాసవంతమైన ప్రాంతం దేవేంద్ర నగర్ లో విటునితో సహా పోలీసులకు దొరికిపోయింది. చత్తీస్ ఘడ్ జైలులో శిక్ష అనుభవిస్తోంది.
దేశంలో అత్యంత గొప్పగా భావించే నేషనల్ గేమ్స్ స్థాయి క్రీడాకారిణి నిషా షెట్టి(26). అస్సాం రాష్ట్రం తరఫున ఆమె 1998 లో జరిగిన నేషనల్ గేమ్స్ లో అథ్లెట్ గా పాల్లొంది. ఎంత ప్రతిభ చూపించినా ఆమెకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందలేదు. క్రీడాకారుల కోటాలో ఉద్యోగానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త కూడా 2007 సంవత్సరంలో మరణించాడు. తన ఐదేళ్ళ కూతుర్ని పోషించుకోడానికి, తాను బతకడానికి ఈ మార్గమే కనిపించిందని ఆమె పోలీసుల వద్ద వాపోయింది. రాయపూర్ లోని క్రీడాభిమానులు కష్టపడి ఆమెకు బెయిల్ ఇప్పించారు. కాని పదివేల రూపాయల పూచీకత్తు కావాలనడంతో డబ్బులు లేని నిషా జైలులోనే ఉండిపోయింది.
చత్తీస్ ఘడ్ వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మహమ్మద్ అక్రమ్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. మేం చేయగలిగింది ఆమెకు బెయిల్ ఇప్పించగలగడం. అంతకన్నా ఆదుకోడానికి మాకు శక్తిలేదు. కానీ, ఇలా జరగకూడదని ఆయన అన్నారు. ఆరేళ్ళ క్రితం పూనేలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ మీట్ లో నిషా హైజంప్ లో రజిత పతకాన్ని కైవసం చేసుకున్న క్రీడాకారిణి. అప్పుడే ఆమె అస్సాం ఫుట్ బాల్ క్రీడాకారుడు సునీల్ షెట్టితో ప్రేమలో పడింది. కుటుంబాన్ని ఎదిరించి వివాహం చేసుకుంది. 2004లో వీరికి కూతురు జన్మించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగిపోయిన సునీల్ మనోవేదనతో మద్యానికి బానిసయ్యాడని, మూత్రపిండాలు దెబ్బతినడంతో చివరకు 2007 ఫిబ్రవరిలో సునీల్ చనిపోయాడని నిషా పోలీసు విచారణలో చెప్పిందని ఒక అధికారి తెలిపారు.
భర్త పోయిన తరువాత నిషా ప్రభుత్వ ఉద్యోగాల కోసం నానా పాట్లు పడింది. ` స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చి బతుకుతామనే నమ్మకం పోయింది' అని న్యాయస్థానంలో నిషా వాపోయింది. ఉద్యోగాన్ని వెదుక్కుంటూ ఏడాది క్రితం ఆమె ముంబయి చేరింది. వ్యభిచారకూపంలో ఇరుక్కుపోయిందని ఆ పోలీసు అధికారి చెప్పారు. రాయపూర్ లోని ముగ్గురు వ్యాపారులతో వారం రోజులు గడపటానికి నిషా,మరో ఇద్దరు వచ్చారు. వీరికి 50 వేల రూపాయలు చెల్లించడానికి వ్యాపారులు బేరం కుదుర్చుకున్నారు. పోలీసులు ఆ వ్యాపారులను కూడా అరెస్టు చేశారు. `మహిళా సాధికారిత కోసం పార్లమెంట్ లో బిల్లు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది. ఇలాంటి ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారలకు కనీసం ఉద్యోగాన్ని ఇవ్వనప్పుడు' అంటూ భారత ఒలంపిక్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి బషీర్ అహ్మద్ ఖాన్ ప్రశ్నించారు.
News Posted: 4 August, 2009
|