కాషాయ సంస్కరణలు
నాగ్ పూర్ : కరడుగట్టిన క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఇకపై కాలానుగుణంగా మారడానికి తయారుగా ఉందని ఆ సంస్థ అధ్యక్షుడు మోహన్ భగవత్ చెప్పారు. 1925లో పుట్టిన ఆర్ఎస్ఎస్ దాని పద్ధతులను ఇంతవరకూ మార్చలేదు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లు సంప్రదాయంగా ధరించే ఖాకీ నిక్కరు, తెల్లచొక్కాను మార్చాలని భావిస్తున్నట్టు భగవత్ చెప్పారు. అలానే షరతులకు లోబడి ప్రచారక్ లు వివాహం చేసుకోడానికి అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. ఇంతకాలం ప్రచారక్ లు అవివాహితులుగా ఉండాలన్న నియమమే అమలులో ఉంది.
ఈ కాషాయ సంఘానికి గత మార్చిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మోహన్ భగవత్ మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. సంఘ్ లో సంస్కరణలను కోరుతున్నవారి సంఖ్య అధికంగానే ఉందని ఆయన అంగీకరించారు. ఖాకీ నిక్కరు బదులు ప్యాంటు ధరించడానకి, ప్రచారక్ లు వివాహం చేసుకోడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారని ఆయన చెప్పారు. అయితే దీనిపై ఏకాభిప్రాయం రాలేదని తెలిపారు. పొట్టి నిక్కరు సౌకర్యంగా ఉంటుందని వాదిస్తున్నవారు, వివాహం చేసుకంటే కుటుంబ జంఝాటంలో చిక్కుకునే ప్రమాదం ఉందని భావిస్తున్నవారూ ఉన్నారని ఆయన వివరించారు. అందుకే కొత్త ప్రతిపాదనలపై నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టామని చెప్పారు. ఖాకీ నిక్కరు పై ఇప్పటికే నాలుగు సార్లు చర్చ జరిగిందని, కాని సంఘ్ ఎప్పుడూ ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంటుందని, దీనిపై ఏకాభిప్రాయం కుదరనందున నిర్ణయాన్ని తీసుకోలేదని ఆయన వివరించారు.
ప్రచారక్ ల వివాహ విషయంపై చాలా వాదోపవాదాలు జరిగాయన్నారు. కానీ ప్రచారక్ లు బ్రహ్మచర్యాన్ని వదిలేసిన తరువాత పూర్తికాలం ప్రచారక్ లుగా కొనసాగే అవకాశం ఉండదని భగవత్ చెప్పారు. చాలా మంది తమ ప్రచారక్ కాలాన్ని ముగించుకున్న తరువాత వివాహాలు చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించారని, సంఘ్ కూడా గహస్థాశ్రమాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ప్రచారక్ లు కన్నా ఎక్కువ మంది కుటుంబాలతో జీవనం సాగించేవారి అవసరమై సంఘ్ కు ఉందని ఆయన చెప్పారు. మీడియాతో స్నేహంగా ఉండటానకి సంఘ్ ప్రయత్నిస్తోంది. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ సీనియర్ సభ్యులు మదన్ దాస్ దేవి, మన్మోహన్ వైద్య, శ్రీకాంత్ జోషి, రామ్ మాధవ్ కూడా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ నేతలను బిజెపి వ్యవహారాలను గురించి ప్రశ్నిస్తే మాత్రం ` అలాంటి ప్రశ్నలను ఆ పార్టీ నాయకులనే అడగండి' అంటూ సమాధానం లభించింది. మైనారిటీలకు రిజర్వేషన్లను మాత్రం సంఘ్ అధినేత తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు పూర్తిగా సామాజిక, ఆర్ధిక స్థాయిని బట్టి ఉండాలని, కాని ఈ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించారు.
News Posted: 4 August, 2009
|