షికాగోలో ఐఐటీయన్ల సదస్సు
న్యూయార్క్ : దేశాలన్నీ ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న నేపధ్యంలో సాంకేతిక నిపుణులు కూడా దీనికి పరిష్కారనికి కృషి చేయాలన్న నినాదంలో పాన్-ఐఐటి ఏడో ప్రపంచ సదస్సును షికాగో నగరంలో ఏర్పాటు చేస్తున్నామని మహాసభ చైర్మన్ రే మెహ్ర తెలిపారు. ఈ సదస్సులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ముఖ్య ప్రసంగం చేస్తారని, మరికొంతమంది అగ్రనేతలు సదస్సుకు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. అక్టోబరు 9 నుంచి 11వ తేదీ వరకూ జరిగే ఈ సదస్సును భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ ప్రారంభిస్తారని వివరించారు. అలానే భారత విజ్ఞాన మండలి చైర్మన్ శామ్ పిట్రోడా, అమెరిగా ముఖ్యసాంకేతిక అధికారి అనీష్ చోప్రా, అమెరికాలో భారత రాయబారి మీరా శంకర్ తదితరులు ఈ సదస్సులో ప్రసంగాలు చేస్తారని తెలిపారు.
`ప్రపంచ ఆర్ధిక రంగం- కొత్త ఆలోచనలు- వ్యవస్థాపకత' అన్న అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు మూడువేల మంది ఐఐటీయన్లు ప్రతినిధులుగా ఈ సదస్సుకు హజరవుతారని ఆయన చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అధ్వర్యంలో నడుస్తున్న విలియమ్స్ జె క్లింటన్ ఫౌండేషన్ ఆశయాలు పాన్-ఐఐటీ ఆశయాలు ఒక్కటిగానే ఉన్నాయని, అందువల్లనే ఆయనను సదస్సుకు ఆహ్వానించామని ఆయన పేర్కొన్నారు. ఇంధన వనరులు, వాతావారణ మార్పులు, వైద్య ఆరోగ్య రంగాలపైనే ఈ రెండు సంస్థలూ పని చేస్తున్నాయని వివరించారు.
సముద్రానికి ఆవతలి వైపున ఇవతలి వైపున ఉన్న అమెరికా, భారత్ దేశాల మధ్య ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవడం, వాటి ఫలితాలను సాధించడం పైనే ఈ సదస్సులో చర్చిస్తారని మెహ్రా చెప్పారు. ఆరోగ్య రంగంలోనూ, ఇంధనాల రంగంలోను భారత్ ఎదుర్కొంటున్న సమస్యలపై పాన్-ఐఐటి అత్యంతవాస్తవమైన దృక్పధాన్ని అనుసరిస్తుందని చెప్పారు. భారతదేశంలో ఉన్నత విద్యను తీర్చిదిద్దేందుకు తీసుకోవలసిన చర్యలను గురించి సిఫార్సు చేస్తూ పాన్-ఐఐటి సదస్సు పంచరత్నాల పేరిట ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నదని వివరించారు. కాగా ఒక్క అమెరికాలోనే 35 వేల మంది ఐఐటీయన్లు ఉన్నారని ఆయన తెలిపారు.
News Posted: 4 August, 2009
|