రాహుల్ ద గ్రేట్
జమ్ము : మాసినట్లు కనిపిస్తున్న చిన్నగెడ్డం, నల్ల కళ్ళద్దాలు, నెత్తి మీద టోపీ... తనకు రక్షణగా ఉన్న ఇద్దరితో ఎక్కడి నుంచో దూర ప్రయాణం చేసి వచ్చినట్లు కనిపిస్తోంది. జీను ప్యాంటు, టీ షర్ట్ పైన చిన్న జాకెట్ ధరించిన ఆ యువకుడు చాలా సాదా సీదా గా మూడు నక్షత్రాల హొటల్ గ్రాండ్ డ్రాగన్ లోకి ప్రవేశించాడు. ఎవరి దృష్టినీ ఆకర్షించకుండానే మార్కెట్లో దాదాపు పదిహేను నిముషాలు నడిచాడు... అతనెవరో కాదు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ. మొన్న శనివారం ఆయన అతి శీతల ప్రదేశమైన లేహ్ ను సందర్శించినప్పటి దృశ్యం ఇది. వారంతాల్లో అతి సాధారణ యాత్రికుడు మాదిరిగా ఆయన లేహ్ ప్రాంతంలో తన ఇద్దరి సహచరులతో సంచరించారు.
గ్రాండ్ డ్రాగాన్ హోటల్ కు వెళ్లిన రాహుల్ కాస్సేపు చదరంగం ఆడారు. ఆ తరువాత స్వీట్ కార్న్ సూప్, వెజిటబుల్ పకోడీ, మటన్ మసాలా, దాల్ ఫ్రై తిన్నారు. హోటల్ యజమాని వద్దంటున్నా బిల్లు చెల్లించారు. `మేం మొదట్లో ఆయనను అస్సలు గుర్తు పట్టలేదు. చాలా మామూలు కస్టమర్ లానే వచ్చారు. కానీ, దగ్గర నుంచి చూసే సరికి ఆయనెవరో మాకు తెలిసింది. అతిధుల నుంచి బిల్లు తీసుకునే సంప్రదాయం లేదని చెప్పాం. అందునా దేశ భావి నాయకుడి నుంచి అసలు తీసుకోమని వివరించాం' అని హోటల్ యజమాని యువకుడు రిచెన్ నమ్గ్యాల్ చెప్పారు. లోక్ సభ సభ్యునిగా ఎవరి దగ్గర నుంచి ఉచితంగా ఏదైనా పొందటం చట్ట విరుద్దమని, కావాలంటే తనకు పదిశాతం డిస్కౌంట్ ఇవ్వవచ్చని చెప్పి రాహుల్ బిల్లును చెల్లించారని ఆ యువకుడు ఆనందంగా వివరించాడు.
రాహూల్ గాంధీ కి సేవలందించిన స్టీవార్డ్ మనోహర్ లాల్ (26)ఆనందానికైతే అంతే లేదు. `నేనెప్పుడో హిమాచల్ ప్రదేశ్ కులూలో ర్యాలీ జరిగినప్పుడు రాహుల్ ను చాలా దూరం నుంచి చూశాను. ఇప్పుడ ఇంత దగ్గర నుంచి చూడటం నా జీవితంలో నేను మరచిపోలేని ఘట్టం ' అంటూ వివరించాడు. గ్రాండ్ డ్రాగన్ యజమాని గులాం ముస్తాఫా అయితే అసలు రాహుల్ గాంధీ వస్తారని తనకు తెలియదని, ఎవరో విఐపి వస్తారని చెబితే విశాలమైన సూట్ ను సిద్ధం చేశామని, కానీ రాహుల్ గాంధీ మాత్రం డబుల్ బెడ్ రూం లోనే బస చేశారని వివరించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా రాహుల్ ప్రవర్తించడం చాలా గొప్ప విషయమని ఆ రాత్రి హోటల్ లో బస చేసిన యాత్రికుడు పేర్కొన్నాడు.
News Posted: 5 August, 2009
|