పరిమళ రాగామృతాలు
కోల్ కతా : డాక్టర్ దేవీ షెట్టి తెలుసా మీకు? అదేనండి గుండెకు శస్త్రచికిత్సలు చేయడంలో దిట్టని ప్రసిద్ధిగాంచిన హృద్రోగ నిపుణుడు. ఆయన ఏం చేస్తారో తెలుసా? గుండెకు ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని వినిపిస్తారు. ఇప్పుడెందుకు ఆ ప్రస్తావనా అంటారా? మరేం లేదు... కొన్ని రాగాలకు మనుషులను కోలుకునేలా చేసే ఇంద్రజాల లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శ్రోతలో తాజాతనపు ఆహ్లాదతత్వాన్ని తట్టిలేపే శక్తి భైరవీ రాగానికి ఉంది. దీనికి సుగంధ పరిమళాలు తోడైతే అనందపు అంచుల్లో మనస్సు తేలియాడుతుంది. తెలుసుగా సుగంధ తైలాలను పరిమళచికిత్స (అరోమాథెరపీ) ఉపయోగిస్తారని.
అద్భతమైన రాగాన్ని, ఆహ్లాదాన్నిచ్చే సుగంధ పరిమళాన్ని మిశ్రమం చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిగ్గా అదే చేశారు సంతూర్ విద్వాంసుడు పండిట్ తరుణ్ భట్టాచార్య. మానసిక ఎదుగదల సక్రమంగా లేని చిన్నారుల కోసం ఆయన ఈ రెండిటి మిశ్రమంతో కచేరీ చేసారు. రెండు గంటల సేపు సాగిన ఈ పరిమళ గాన లహరిలో ఆ పిల్లలు ఓలలాడారు. రోజూ రమ్మని కోరారు. ఇప్పుడు ఆ పిల్లల మానసిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ఆశ్రమ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. విదేశాలలో సైతం తరుణ్ ఇదే ప్రయోగాన్ని చేసినప్పుడు కూడా అదే విజయాన్ని సాధించారు. న్యూయార్కులో జరిగిన ప్రపంచ గాన విభావరిలో తరుణ్ కచేరీ ముగిసిన తరువాత ఒక మహిళ ఆయన దగ్గరకు వచ్చి అంత వరకూ తాను ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నానని, కాని పాట విన్న తరువాత తనకు బతుకు మీద ఆశ చిగురించిందని వివరించింది.
సుగంధ తైలాల పరిమళాన్ని, రాగాలను మిళితం చేస్తూ వాటిని ఆస్వాదిస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి తరుణ్ నాలుగు సిడీలను ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసారు. ఈ అల్బమ్ లతో పాటు చిన్న కరపత్రాన్ని కూడా జత చేశారు. ఏ రాగాన్ని వింటున్నప్పుడు ఏ పరిమళాన్ని ఉపయోగించాలో దీనిలో విశదీకరించారు. మనస్సులో తాజాతనపు భావాలను రేకెత్తించడానికి సుప్రభాత రాగమైన భైరవిని వినాలని, దానితో పాటు మల్లెపూల లేదా గులాబి పరిమళాన్ని వెదచల్లే సుగంధ తైలాలను వినియోగించాలని తరుణ్ పేర్కోన్నారు. అలానే సంధ్యా రాగమైన యమన్ ను ఆలకించేటప్పుడు గంధపు సువాసనలను ఆస్వాదించాలి. నిశిరాత్రి వేళ బాగేశ్రీ రాగంతో పాటు ఘాటైన గులాబీల పరిమళాన్ని ఆఘ్రాణించాలి. ఫలాల సుగంధాన్ని కీరవాణి రాగంతో మిళితం చేస్తే శృంగార భావనలు పొటమరిస్తాయి. హంసధ్వని, కీరవాణి, కళావతి రాగాలను రోగులకు వినిపిస్తే వారు త్వరగా కోలుకుంటారని పండిట్ తరుణ్ భట్టాచార్య చెబుతున్నారు.
రాగాలను పరిమళాలతో మిళితం చేయాలన్న ఆలోచన తరుణ్ కు విమానాశ్రయంలో అకస్మాత్తుగా వచ్చింది. ప్రయాణీకులు విశ్రాంతి గదిలో టెస్టింగ్ కాగితాల పరిమళాలను ఆస్వాదించడానికి ప్రయత్నించడం చూసి ఏ రాగానికి ఏ పరిమళం జత కూడుతుందో ప్రయోగం చేయాలని అనుకున్నానని ఆయన వివరిస్తారు. కాని బహిరంగ కచేరీల్లో ఈ ప్రయోగం చేయడం కష్టమని చెబుతున్నారు. అందుకే చిన్న చిన్న బృందాలకు ఒక విశాలమైన గదిలో రాగపరిమళాలను అందిస్తున్నానని తెలిపారు. ఒత్తిడితో సతమతమయ్యే సినీ తారలను, టీవీ తారలను, వ్యాపారస్తులను ఎంపిక చేసుకుని వారి కోసం కచేరీలు చేస్తున్నానని వివరించారు.
News Posted: 5 August, 2009
|