లోక్ సభలో 420కి చోటు లేదు
న్యూఢిల్లీ : లోక్ సభలో '420'కి స్థానం కరువైంది! ఇదేమిటా అని ఆశ్చర్యపోవలసిన పనిలేదు. పార్లమెంటు సభ్యులు కూర్చోవడానికి ఆయా స్థానాలకు నెంబర్లు కేటాయించడం ఆనవాయితీ. కానీ, గత లోక్ సభలో గౌరవ సభ్యులు తన స్థానానికి 420 నెంబరును ఇవ్వడాన్ని అగౌరవంగా భావించారు! దాంతో ఆయనకు 420కి బదులుగా 419 (ఎ) నెంబరును అధికారులు కేటాయించారు. దీంతో పార్లమెంట్ రికార్డుల్లో 420 సీటుకి స్థానం లేకుండా పోయింది. ప్రస్తుతం 419 (ఏ) స్థానాన్ని అస్సాంకు చెందిన ఏయూడీఎఫ్ నాయకుడు బద్రుద్దీన్ అజ్మల్ కు కేటాయించారు. ఇంతకీ 420... అనగానే ఐపీసీ సెక్షన్ 420 గుర్తుకు వస్తోందన్నది గౌరవ సభ్యుని ఆవేదన! ఎవరినైనా మోసగించినవారిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదౌతుంది! ఇన్నాళ్ళూ పేరులోనే పెన్నిధి! అనుకున్నాం! ఇప్పుడు నెంబరు లోనే 'నేము'న్నది అని రుజువైంది! నెంబర్ల ప్రకారం స్థానాలు కేటాయించాలంటే వ్యభిచార నిరోధక చట్టం, హత్యానేరాన్ని గుర్తించే సెక్షన్ లు 294, 302 స్థానాలు గల్లంతు కావాల్సి ఉంటాయి. అలా అయితే మన అసెంబ్లీలో 294 నెంబరు గల్లంతు కావాల్సి ఉంటుంది! అన్నట్లు నెంబర్లతో పిలవడం అవమానంగా భావించి, ప్రస్తుతం పోలీసులను పేర్లతో పిలుస్తున్న విషయం తెలిసిందే!
News Posted: 6 August, 2009
|