మెరుపు చోర బామ్మ షికాగో : ఆవిడ పేరు చెబితే దుకాణాల్లోని వస్తువులు వణుకుతాయ్. యజమానుల గుండెలు భయంతో లబలబలాడతాయి. ఆ మహిళామణి షాపింగ్ కు బయలు దేరిందని ఒకవేళ పోలీసులకు తెలిస్తే చాలు తలలు పట్టుకుంటారు. షాపింగ్ మాల్స్ లో ఖరీదైన వస్తువులను మాయం చేయడంలో చేయితిరిగిన చోర శిఖామణి గా ప్రసిద్ధి గాంచారు. దుకాణం నుంచి తనకు కావల్సిన వస్తువులను చకచకా కాజేసి చటుక్కున తప్పించుకోవడంలో దిట్టయిన మెరుపురాణి వయస్సు ఎంతో తెలుసా... 86 సంవత్సరాలు మాత్రమే. ఆమె షికాగో పోలీసులకు దొరికిపోయింది. ఈ చురుకైన చోర బామ్మ చర్మం ముడతల బారిన పడకుండా కాపాడే క్రీములను, ఆయిల్ ఆఫ్ ఒలే ఫేస్ క్రీములను, చిన్న బ్యాటరీలను దొంగిలించి దొరికిపోయింది. ఇలా పోలీసులకు పట్టుబడటంలో కూడా ఈ చోర మామ్మ గారిది రికార్డే. ఆఫ్ సెంచరీ ఎప్పుడో పూర్తి చేసిన ఈమె తాజాగా అరవై ఒకటో సారి అరెస్టయ్యింది.
ఈ మెరుపు బామ్మ పేరు ఎల్లా ఒర్కొ అని, దుకాణాల్లో దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకుందని పోలీసులు తెలిపారు. పదివేల డాలర్ల పూచీ కత్తుతో కోర్టు బెయిల్ మంజూరి చేసింది. ఐదు ఖరీదైన చేపల ప్యాకెట్లను, 11 బ్యాటరీ ప్యాకెట్లను, చర్మం ముడతలు పడకుండా ఉండటానికి వాడే లోరియల్ క్రీములు రెండు, ఓలే ఫేస్ క్రీములున్న ఎనిమిది బాక్స్ లను, నాలుగు కాఫీ పొడి సీసాలను మామ్మ గారు దుస్తుల కింద దాచుకుని చల్లగా జారుకుంటుంటే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మొదటిసారిగా ఎల్లాను 1956 సంవత్సరంలో ఇలాంటి నేరంపై అరెస్టు చేశారు. పదమూడుసార్లు కోర్టు శిక్షించింది. అంతేకాదండోయ్ ఎల్లా బామ్మకు ఇరవైకి పైగా మారుపేర్లు కూడా ఉన్నాయి.
News Posted: 8 August, 2009
|