విద్యపై 'సివిల్' పెత్తనం వద్దు న్యూఢిల్లీ : విద్యారంగంలో సివిల్ సర్వీస్ అధికారుల పెత్తనానికి భరతవాక్యం పలకాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. తన శాఖ పరిధిలోని విద్యాసంస్థల పరిపాలనా వ్యవహారాలు చూసేందుకు ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులను నియమించరాదని సిబాల్ అంటున్నారు. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రులుగా ఇప్పటి వరకు పనిచేసిన వారు పలు విద్యాసంస్థలను అజమాయిషీ చేసేందుకు ఐఏఎస్, ఐపీఎస్ 'బాబు'లనే నియమించారు. సిబాల్ కన్నా ముందు మంత్రిగా పనిచేసిన అర్జున్ సింగ్ సిబ్బంది వ్యవహారాల శాఖ అభ్యంతరాలు తెలిపినా కూడా 'సీబిఎస్ ఈ' అధిపతిగా ప్రజ్ఞా శ్రీ వాత్సవ పేరును ఖరారు చేశారు.
ఇందుకు భిన్నంగా విద్యాసంస్థల్లో నియామకాలు జరగాలని భావిస్తున్న సిబాల్ - 'జామియా మిలియా ఇస్లామియా'కు నూతన వైస్ ఛాన్సలర్ ను నియమించడంలో తొలి పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. విద్యావేత్తలను పాలనాధిపతులుగా నియమించాలన్న సిబాల్ యోచనకన్న ముందే సిద్ధమైన జాబితాలోని ఐదుగురిలో ముగ్గురు విద్యావేత్తలు. వారిలో ఒకరు పదవీవిరమణ చేసినవారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు ఒకరు ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ముషీరుత్ హసన్. మరొకరు జామియాలోని సైన్స్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ పైజాన్ అహ్మద్. హసన్ సీనియర్ అయినప్పటికీ తిరిగి అతన్ని వైస్ ఛాన్సలర్ గా నియమించేందుకు ముస్లింలలోని కొన్ని వర్గాలు సుముఖంగా లేవు. కొంతమంది ఎంపీలు కూడా వ్యతిరేకిస్తున్న తరుణంలో సిబాల్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారనుంది.
వైస్ ఛాన్సలర్ నియామకం ఎలా ఉన్నా సిబిఎస్ ఈకి తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరిస్తున్న వినీత్ జోషి స్థానాన్ని ఏ విద్యావేత్త భర్తీ చేస్తారన్నది ఇంకా తేలలేదు. ఛైర్మన్ గా అశోక్ గంగూలీ ఎన్డీఏ హయాంలో నియమితుడై 8 ఏళ్ళపాటు పనిచేశారు. గంగూలీ తరువాత తాత్కాలిక ఛైర్మన్ గా పలుమార్లు పొడిగింపులు పొందిన జోషికి గల ప్రస్తుత వ్యవధి జులై 31తో ముగిసింది. తాజాగా కూడా ఆయనకు మరోమారు పొడిగింపు లభించింది. ఛైర్మన్ గా నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది! విద్యాసంస్థల నిర్వహణలో మూడేళ్ళ అనుభవాన్ని కనీస అర్హతగా ఇంతకుముందు నిర్ణయించారు. ప్రస్తుతం ఐదేళ్ళ అనుభవం ఉండాలని మంత్రి కపిల్ సిబాల్ ఆశిస్తున్నారు. విద్యాసంస్థలను 'సివిల్' అధికారుల బంధం నుంచి విముక్తం చేయాలన్న ఆయన కల ఎప్పటికి నెరవేరుతుందో!
News Posted: 14 August, 2009
|