ఫీజుల్లేని యూనివర్శిటీ కోల్ కతా: చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థిక వనరులు లేని విద్యార్థులకు ఓ శుభవార్త. ఉన్నత విద్యను ఉచితంగా అందించే ఉద్దేశంతో ఫీజుల్లేని 'ఆన్ లైన్ యూనివర్శిటీ' ఒకటి సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో మొట్టమొదటి ట్యూషన్ ఫీజులు లేని ఆన్ లైన్ యూనివర్శిటీని నెలకొల్పబోతున్నామని యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు షాయి రెషెఫ్ చెప్పారు. విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించే ఉద్దేశంతో ఏర్పాటవుతున్న ఈ 'పీపుల్స్ యూనివర్శిటీ' సామాజిక నెట్ వర్కింగ్ వెబ్ సైట్లను ఉపయోగించుకుని పని చేస్తుందని, అధ్యాపకులు కేవలం పర్యవేక్షకులుగా ఉంటూ అవసరమైన సమయాల్లో విద్యార్థులకు మార్గదర్శకత్వాన్ని అందిస్తారని ఆయన తెలిపారు. స్టడీ మెటీరియల్ ను పిహెచ్ డిలు, ప్రొఫెసర్లు రూపొందిస్తారని, వీరిలో చాలా మంది స్వచ్ఛందంగానే పని చేస్తారని ఆయన చెప్పారు. సామాజిక సంబంధాలకు సంబంధించిన వెబ్ సైట్లు విజయవంతం కావడం చూసిన తర్వాత విద్యార్థులు 'ఆన్ లైన్' వేదికను ఉపయోగించుకుని పరస్పర సహకారంతో తమ సమస్యలను తామే పరిష్కరించుకునే వీలు ఉండే ఒక ఆన్ లైన్ యూనివర్శిటీని రూపొందించాలని తాను అనుకున్నానని ఆయన తెలిపారు. విద్యార్థుల మధ్య బోధనను ప్రోత్సహంచడం ద్వారా తమ ఖర్చులను అదుపులో ఉంచగలుగుతామన్నారు.
చదువుకోవాలనే కోరిక ఉన్నా, అవకాశాలు లేని విద్యార్థులకు మెరుగైన విద్యను ఉచితంగా అందించే సంస్థగా ఇది ఉంటుందన్నారు. ఇల్లు విడిచి యూనివర్శిటీకి వెళ్ళి చదువుకునే అవకాశం లేని విద్యార్థులకు, ఉన్నత విద్యా సంస్థలు లేని ప్రాంతాలలోని విద్యార్థులకు తాను సాయపడాలని అనుకుంటున్నాని ఆయన చెప్పారు. ఈ యూనివర్శిటీ విద్యా కార్యకలాపాలన్నీ కూడా మన దేశంలోనే ఉంటూ ఉండగా, కాలిఫోర్నియాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ అవసరమైన ఆర్థిక వనరులను సమకూరుస్తోందన్నారు. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంను కలుసుకోవడానికి రెషెఫ్ ఇటీవల మన దేశాన్ని సందర్శించారు. ఈ యూనివర్శిటీకి గెస్ట్ లెక్చరర్ గా ఉండడానికి తన వద్ద ఉన్న కోర్స్ మెటీరియల్ ను, ఇతర పరిశోధనా పత్రాలను అందించడానికి కలాం అంగీకరించారని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితికి చెందిన సమాచార, ప్రసారాల సాంకేతిక పరిజ్ఞానాలు, వాటి అభివృద్ధికి సంబంధించిన అంతర్జాతీయ ఒడంబడికకు రెషఫ్ సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. మిగతా ఇంటర్నెట్ ఆధారిత యూనివర్శిటీల తరహాలోనే ఈ 'యూనివర్శిటీ ఆఫ్ పీపుల్'లో కూడా ఆన్ లైన్ స్టడీ బృందాలు, వారంవారం చర్చా గోష్టులు, హోమ్ వర్క్ అసైన్ మెంట్లతో పాటుగా పరీక్షలు కూడా ఉంటాయని అన్నారు.
News Posted: 15 August, 2009
|