వృత్తి కాలేజీలపై ఐటి కన్ను హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ, ఫార్మసీ కాలేజీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న యాజమాన్యాలపై ఆదాయపన్ను శాఖ దృష్టి సారించింది. కాలేజీల సొసైటీసభ్యులకు చాలా మందికి ప్యాన్ నెంబర్ కూడా లేదని, వారు ఎలాంటి రిటర్నులు కూడా దాఖలు చేయడం లేదని తెలిసింది. అయినా కోట్లాది రూపాయిల పెట్టుబడులు ఎక్కడి నుండి తెస్తున్నారో, ఆ నిధుల ప్రవాహం ఎలా జరుగుతుందో అనే అంశంపై ఆదాయపన్ను శాఖ వివరాలను సేకరిస్తోంది. కాలేజీలు గత పక్షంలో ఇచ్చిన ప్రకటనల్లో తమ సొసైటీల పరిధిలో ఉన్న సంస్థలన్నింటి గురించి వివరించాయి. గతంలో ఆదాయపన్ను శాఖ అధికారులను ఒకే గొడుగు కింద ఎలా నిర్వహిస్తున్నారో పరిశీలిస్తున్నారు.
చాలా కాలేజీల సొసైటీలలో సభ్యులు బినామీ పేర్లతో ఉన్నట్టు తెలియడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఏఐసిఇ చైర్మన్ యాదవ్, మెంబర్ సెక్రటరీ నారాయణరావులు సిబిఐ దాడుల్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన నేపథ్యంలో ఏఐసిటిఇ ఈ ఏడాది రాష్ట్రంలో అనుమతించిన కాలేజీలు, యాజమాన్యాలపై సిబిఐ ప్రత్యేక పరిశీలనలు జరపడంతో కీలక పత్రాలు - అంశాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ప్రాధమిక పరిశీలనల్లో దొరికిన సాక్ష్యాధారాలను దృష్టిలో ఉంచుకుని కొంత మంది 'పెద్దల' ఇళ్ళపై దాడులకు సిబిఐ రంగం సిద్ధం చేసుకుంది. గత 20 రోజులుగా సాగుతున్న ఈ పరిశీలనల్లో డజనుకు పైగా యాజమాన్యాలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు సిబిఐ గుర్తించింది.
కాగా కార్పొరేట్ విద్య పరిఢవిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది కాలంగా ఇన్ కంటాక్స్ అధికారులు నారాయణ, శ్రీ చైతన్య, వికాస్, విజ్ఞాన్ తదిదర సంస్థల 'అకౌంట్ల'పై నిఘా పెట్టి వివరణ కోరింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎంబిఎ, ఎంసిఎ, బిఇడి, ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దృష్టి సారించారు. షాదాన్, మల్లారెడ్డి, నోవా, అవంతి, ఆదిత్య, వైపిఆర్ అరోరా, ఎంఎన్ ఆర్, టిఆర్ ఆర్, టికెఆర్ తదితర యాజమాన్యాల చేతుల్లోనే 150 వరకూ కాలేజీలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల పేరుతో కాలేజీలు హైదరాబాద్ పరిధిలోనే నడుస్తున్నాయి.
News Posted: 15 August, 2009
|