తొలి బాధితురాలు వసుంధర! న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్వయం సేవక్ సంస్థ (ఆర్ ఎస్ఎస్) మధ్య జరుగుతున్న అధిపత్య పోరులో మొదటి బాధితురాలిగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుందరా రాజే కానున్నారు. భాజపా సీనియర్ నేత అద్వానీ, ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ మధ్య పోరు కేంద్రీకృతమైనట్లు కనిపిస్తోంది. శాసనసభాపక్షం నాయకత్వానికి రాజీనామా చేయాలని పార్టీ అధినాయకత్వం వసుంధరా రాజెను ఆదేశించారు. ఇందుకు నిరసనగా తనకు శాసనసభ్యుల్లో మద్దతు ఉందంటూ 62 మంది శాసనసభ్యుల బృందాన్ని ఢిల్లీ నాయకత్వం వద్దకు పంపించారు. అయితే ఈ బృందాన్ని కలిసేందుకు నిరాకరించిన అద్వాని వారి వద్ద నుంచి వినతి పత్రాన్ని మాత్రం స్వీకరించారు. మరో వైపు శాసనసభ్యుల బృందాన్ని భాజపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కలిసినప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వాదన వినిపించేందుకు వసుంధర తీసుకున్న శాసనసభ్యుల ఢిల్లీ యాత్ర నిర్ణయం ఆమెను మరింతగా ఇబ్బందుల్లోకి నెడుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్కసారి బెదిరింపు రాజకీయలకు తలొగ్గితే అన్ని రాష్ట్రాల్లో ఈ ధోరణి పెరుగుతుందన్న భావనలో భాజపా అధిష్టానం ఉంది.
ప్రతిపక్ష నేతగా వైదొలిగేందుకు ఈ ఏడాదిలోగా తన వారసుని ఎన్నుకునేందుకు ఆర్ ఎస్ ఎస్ కు అద్వాని వ్యవధి ఇచ్చారు. కానీ నాయకత్వం మార్పును 'సంగ్' కోరక పోవచ్చునని కొన్ని వర్గాలు తెలిపాయి. మరో ఐదేళ్ళు 'షాడో ప్రధాని'గా అద్వానీ కొనసాగడం రాజ్ నాద్ సింగ్ కు మాత్రం ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుత పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆర్ ఎస్ ఎస్ సహకారంతో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. లోక్ సభలో ప్రతిపక్ష నేత అధ్వానీకి, ఉపనేత సుష్మాస్వరాజ్ తో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు అరుణ్ జెట్లీ తదితరుల మద్దతు ఉంది.
మరోవైపు వసుంధరను రాజస్థాన్ లో నాయకత్వం బాధ్యతల నుంచి తొలగించేందుకు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ ప్రాధమికంగా అంగీకరించారని సమాచారం. ఇక ఆమె భవిష్యత్తును నిర్ణయించాల్సింది - ఆర్ ఎస్ ఎస్ నాయకత్వమే! ఢిల్లీ యాత్రకు వచ్చిన వసుంధర మద్దతు దారులు ఒక వినతి పత్రాన్ని రాజ్ నాథ్ సింగ్, అద్వానీలకు సమర్పించారు. రాజే కు మాత్రమే ప్రజల్లో ఆదరణ ఉందని... ఆమె నాయకత్వం లోనే పార్టీ బలోపేతం అయిందన్న విషయాన్ని గుర్తించాలని ఈ వినతి పత్రంలో కోరారు.
News Posted: 15 August, 2009
|