సింధియా సిస్టర్ల వైరుధ్యం! భోపాల్ : భారతీయ జనతా పార్టీతో అనుంబంధం గల సింధియా సోదరీమణుల్లో వేర్వేరు అనుభవాలు కనిపిస్తున్నాయి. గ్వాలియర్ యువరాణి అయిన యశోధర రాజే, ఆమె అక్క వసుంధరా రాజేలు పార్టీతో భిన్నమైన వైఖరిలో ఉన్నారు. రాజస్థాన్ లో శాసనసభాపక్షం నాయకత్వాన్ని వీడేందుకు వసుంధరా ససేమిరా అంటున్నారు. భాజపా రాజకీయాలతో విసిగి పోయిన యశోధర రాజే జైన సన్యాసినిగా నిరాడంబర జీవితం గడిపేందుకు ఇష్టపడుతున్నారు.
గ్వాలియర్ లోక్ సభ సభ్యురాలైన యశోధర శివపురిలో జరిగిన సాధువుల సమ్మేళనంలో మాట్లాడుతూ భ్రమా పూరిత రాజకీయాల పట్ల విసిగి పోయామన్నారు. 2008 శాసనసభ ఎన్నికల్లో శివపురిలో ఓడిపోవడంతో మధ్య ప్రదేశ్ భాజపా శాఖ తనను లక్ష్యంగా చేసుకొని వ్యవహరించిందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. 'నేను పార్టీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను' అని చెప్పారు.
కొంత కాలం పార్టీకి దూరంగా వ్యవహరించిన యశోధర కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని ఆమె ఖండించారు. కాంగ్రెస్ లో తన మేనల్లుడు జ్యోతిరాధిత్య సింధియాతో పాటు మధ్యప్రదేశ్ భాజపా అధ్యక్షుడు నరేంద్ర సింగ్ తోమర్, అనూప్ మిశ్రా (వాజ్ పేయ్ బంధువు) తో పోరాడుతున్నారు. పార్టీలో తన అక్క వసుంధర ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాట్లాడేందుకు నిరాకరించారు. వాస్తవానికి వారిద్దరి మధ్య సత్ సంబంధాలే ఉన్నాయి.
జైన 'సాధ్వీ' జీవితం పట్ల ఆకర్షితులైన యశోధర లౌకిక ఆసక్తిగల విషయాలను వదిలివేస్తున్నారు. ప్రతిరోజూ ఆడటానికి ఇష్టపడే పోలో ఆటను మరిచారు! అలాగే జైపూర్, ఢిల్లీ, ముంబాయి, లండన్, పారిస్ పర్యటనలను క్రమంగా తగ్గించారు. సాద్విగా మారాలంటే ముందుగా అంతర్ముఖంగా పరివర్తన చెందాలి. బాహ్య సుఖాలను త్యజించాలి. ప్రపంచంతో సంబంధాలను తెంచుకోగలగాలి. 'సాధ్వి'గా అవసరమైన మేరకు... మితాహారాన్ని స్వీకరించాలి. ఈ విషయంలో యశోధరకు మరో కాషాయ ధారిణి ఉమాభారతి చిట్కాలు అవసరమేమో!
News Posted: 15 August, 2009
|