ఉసురు తీసిన టీవీ 'షో' న్యూఢిల్లీ : దంపతుల మధ్య తెలియని 'ఎడబాటు'ను సృష్టిస్తున్న టీవీ కార్యక్రమాలు, వారి మధ్య కలతలను రేపడమే కాక ప్రాణాలు తీసుకునేందుకు కూడా కారణమవుతున్నాయి. ఒక టీవీలో ప్రసారం అవుతున్న 'షో'ను అనుకరించిన దంపతుల్లో భార్య చెప్పిన 'నిజాన్ని' జీర్ణించుకోలేకపోయిన భర్త ఉరి పోసుకున్నాడు.
ఇక్కడకు సమీపంలోని నోయిడాలో ఉంటున్న దంపతులు సురీందర్, రత్నా ఈ నెల 11న టీవీషో 'సబ్ కా సామ్నా'ను చూశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 'ఈవెంట్ మేనేజర్' ఒకరు 'సత్యపీఠం'పై కూర్చొని తనకు అక్రమ సంబంధం ఉందని అంగీకరించారు. ఈ షో ముగిసిన తరువాత సురీందర్ మనం కూడా అటువంటి 'షో' ఆడుకుందామని భార్య రత్నాను కోరాడు. అందుకు ఆమె తొలుత నిరాకరించినా భర్త వత్తిడితో అంగీకరించింది. అనంతరం భర్త వేసిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన ఆమె... 'ఇక ఆట చాలునని, మానేద్దామని' భర్తకు సూచించింది. అయినప్పటికీ వినని భర్త 'అప్పుడే పుట్టిన బిడ్డగా భావిస్తూ నిజాలు చెప్పాలి' అని భార్యను వత్తిడికి గురిచేశాడు. ఆమె అంటే తనకు ఎంతో మమకారమని కూడా చెప్పాడు. పెళ్ళికి ముందు ఎవరితోనైనా 'సీరియస్' సంబంధం ఉందా అని భార్యను ప్రశ్నించిన సురీందర్ కు 'అవున'ని సమాధానం వచ్చింది. దాంతో కలవరపాటుకు గురయ్యాడు. 'షో' ముగించిన కొద్ది సేపటికి వారిద్దరూ నిద్రించారు. కొంత సేపటి తర్వాత మెలుకవ వచ్చి చూసిన ఆమెకు సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న భర్త కనిపించాడు. వెంటనే ఆమె ఇరుగుపొరుగు వారి సాయంతో అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్ళినా ఫలితం లేకపోయింది.
ఈ సంఘటనకు 15 రోజుల క్రితం 'సబ్ కా సామ్నా' షోని నిషేధించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా మన సామాజిక సంబంధాలు టీవీషోలకే దెబ్బ తీనేంత బలహీనమైనవి కావని హైకోర్టు అభిప్రాయపడింది. కానీ టెలివిజన్ లో సత్యం కన్నా... జీవన సత్యం కఠినమైంది!
News Posted: 15 August, 2009
|