కాంగ్రెస్ లోకి చిరు, లేడీబాస్! హైదరాబాద్ : రాజకీయ నేతలుగా మారిన సినీనటులు మెగాస్టార్ చిరంజీవి, 'లేడీబాస్' విజయశాంతి క్రమంగా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సొంతంగా రాజకీయ సంస్థలు స్థాపించిన వారిద్దరూ సినిమా రంగంలో మంచి హిట్ సినిమాలు అందించిన జంట. వారిద్దరు నటించిన అనేక సినిమాలు వసూళ్ళు బాగా చేశాయి. కారణాలు ఏమైనప్పటికీ వారిద్దరి మధ్య సంబంధాల్లో 'అపార్థం' ఏర్పడిందనేది సత్యం. చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసినపుడు వారిద్దరూ పరస్పరం ఆరోపణలు కూడా చేసుకున్నారు. రాజకీయాల్లో తను చిరంజీవి కన్నా సీనియర్ నని విజయశాంతి చెప్పారు. (1997లో ఆమె భారతీయ జనతా పార్టీ లో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు). మరోవైపు చిరంజీవి కూడా రాజకీయాల్లో ఆమె 'ఉనికి'ని గుర్తించడానికి నిరాకరించారు. తనకు వ్యక్తులు ప్రధానం కాదని చిరు పేర్కొన్నారు. అయితే 2009 శాసనసభ ఎన్నికల ముందువిజయశాంతి తన 'తల్లి తెలంగాణ' పార్టీని తెరాసలో విలీనం చేసింది. కానీ ఎన్నికల ఫలితాల్లో ప్రజారాజ్యం కానీ, తెరాస కానీ అనుకున్న లక్ష్యాలు సాధించలేక పోవడం వీరిద్దరిలో నైరాశ్యాన్ని పెంచిందనవచ్చు.
ఈ నేపథ్యంలో వారిద్దరూ కూడా ఎవరికి వారుగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన సన్నిహితులతో స్నేహంగా మెలగుతున్నారు. చిరుతో అసెంబ్లీ లాబీల్లో మంత్రులు వట్టి వసంతకుమార్, బొత్స సత్యనారాయణలు తరచూ చర్చలు జరుపుతున్నారు. వీరిలో బొత్స అయితే బహిరంగంగా కాంగ్రెస్ కు చిరు మద్దతు కావాలని సూచిస్తున్నారు! ఇటు తెరాస తరఫున మెదక్ ఎంపీగా ఎన్నికైన విజయశాంతి అభివృద్ధి కార్యక్రమాల మంజూరు కోసం అంటూ ఇప్పటికి రెండుసార్లు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సిఎం కు సన్నితులైన నేతలు తూర్పు జయప్రకాష్ రెడ్డి వంటి వారితో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన విశ్లేషకులు ఇక వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమే 'మిగిలింది' అంటున్నారు.
News Posted: 17 August, 2009
|