చీమకుర్తికి మళ్ళీ మహర్దశ ఒంగోలు : అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావానికి కుదేలైన చీమకుర్తి గ్రానైట్ ప్రరిశ్రమకు మళ్ళీ మంచిరోజులు వచ్చేస్తున్నాయి. ఖరీదైన, విలాసవంతమైన గెలాక్సీ (నాపరాయి) రాళ్ళ కోసం చైనా నుంచి ఎగుమతులకు ఆర్డర్లు వస్తున్నాయి. గత ఏడాది అంతా కలిపి... చీమకుర్తి లోని పరిశ్రమలు 26 వేల క్యూబిక్ మీటర్లు రాయిని మాత్రమే ఎగుమతి చేశాయి. ఈ ప్రాంతంలో సుమారు 50 గనులు, 250 పాలిష్ యూనిట్లు, 50 కోత యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి లభిస్తోంది.
చీమకుర్తికి ప్రధాన ఎగుమతి మార్కెట్ అయిన అమెరికాకు రాయిని ఎగుమతి చేయడం గత ఏడాది జులైలో నిలిచిపోయింది. అప్పటినుంచి పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గనుల్లో నిరంతరం జరిగే మూడు షిప్టుల్లో పని కాస్తా ఒక్క షిప్ట్ కే పరిమితమైంది. 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి కాస్తా వేలల్లోకి పడిపోయింది. స్థానికంగా మార్కెట్ లో కూడా వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో గత జులై నుంచి 26 వేల క్యూబిక్ మీటర్ల గెలాక్సీరాయి కోసం చైనా నుంచి ఆర్డర్ వచ్చింది. ఈ నెలలో కూడా 20 వేల క్యూబిక్ మీటర్ల రాయి కోసం ఎగుమతి ఆర్డర్ వచ్చిందని గని యజమాని ఒకరు చెప్పారు. దీంతో గనుల యజమానులు, కార్మికుల్లో పూర్వవైభంకోసం 'చిన్న.. చీనీ' ఆశ మొదలైంది.
News Posted: 17 August, 2009
|