మళ్ళీ రుతురాగాలు హైదరాబాద్ : రాష్ట్రంలో రుతుపవనాల పునరాగమనంతో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులలో ఆశలు చిగురింపచేస్తున్నాయి. వర్షాల జాడలేక గత నెలన్నర రోజుల్లో 21 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వర్షాభావ పరిస్థితి కొనసాగితే పరిస్థితులు మరింతగా విషమిస్తాయని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతున్న తరుణంలో వరుణ దేవుడు కరుణించాడు. 'నైరుతి రుతుపవనాలు తిరిగి ఉత్తేజితమయ్యాయి. దీనివల్లనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి' అని వాతావరణ శాఖ సహాయ అధికారి ఆర్ వి.సుబ్బారావు తెలిపారు. సోమవారం రెండు విడతలుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లో 112.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పల్లపు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు షరా మామూలైనాయి. మురికివాడల్లోని ఇళ్ళల్లోకి నీళ్ళు ప్రవేశించాయి. కొన్ని అపార్ట్ మెంట్ల సెల్లార్లలోకి నీళ్ళు పరుగులు తీశాయి. మురికి కాల్వలు పొంగిపొర్లాయి.
కర్నూలు జిల్లా పత్తికొండలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాలో, తెలంగాణలో 24 గంటలుగా నిరవధిక వర్షాలు కురిశాయి. రాగల 48 గంటల్లో రాయలసీమ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆగస్ట్ చివరి వరకు వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పైర్లను సమీక్షించాల్సి ఉంటుందని వ్యవశాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. దిగుబడులు మాటెలా ఉన్నా రైతులకు వచ్చే ఖరీఫ్ వరకు పశుగ్రాసానికి ఢోకా ఉండదని చెబుతున్నారు.
News Posted: 18 August, 2009
|