అసెంబ్లీలో వరుణ జపం హైదరాబాద్ : వర్షాలను కురిపించే వరుణ దేవుడు ఎవరి పక్షంలో ఉన్నాడన్న దానిపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తుందన్న భయంతో వరుణ దేవుడు రాష్ట్రం విడచి వెళ్ళాడని, కూటమి అధికారంలోకి రాలేదన్న విషయం తెలిసి, మళ్ళీ రాష్ట్రంలోకి వరుణ దేవుడు వస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ ఆదివారం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖలతో సోమవారం అసెంబ్లీలో వరుణ పురాణానికి దారి తీసింది. సీపీఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, వరుణ దేవుడు కాంగ్రెస్ కు చెందినవాడేనని పేర్కొన్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి తక్షణమే స్పందించిన మంత్రి రోశయ్య మాట్లాడుతూ, కమ్యూనిస్టు నాయకులు దైవాన్ని నమ్ముతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. అయితే, వరుణ దేవుడు మాత్రం తమ పక్షమేనని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి రోశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఇతరులు అధికారంలోకి రావడానికి వామపక్షాలు ఎప్పుడూ తోక పార్టీలుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తాము ఎవరికీ తోకలం కాదని, ప్రజల పక్షానే పోరాడతామని సీపీఎం నేత రంగారెడ్డి ప్రతిస్పందించారు. తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అవినీతి మధనానికి భయపడి వరుణ దేవుడు పారిపోయాడని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ 2004 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుణ దేవుడు ఎవరి వాడన్న వాదన జోరందుకుంది. తెలుగుదేశం హయాంలో వరుసగా కరవు తాండవం చేసిందని, తాము అధికారంలోకి రావడంతోనే వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ వాదించడం ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల పుణ్యమో, వైఎస్ అదృష్టమో వరుసగా ఐదేళ్ళు వర్షాలు కురిశాయి. ఈ మధ్య కాలంలో అనేక సార్లు తెలుగుదేశం హయాంలో కరవు - తమ పాలనలో సిరిసంపదలు అని అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఆనందంగా, ఒకింత గర్వంగా చెప్పుకొనేవారు. 2008లో కొద్దిగా వర్షాలు వెనకాడితే... విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అస్తవ్యస్థ పరిస్తితులను చక్కదిద్దడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రం మర్చి పోతుంటారు. గత ఎన్నికల్లో కొన్ని చోట్ల - తిరిగి తెలుగుదేశం అధికారంలోకి వస్తే వర్షాలు కురవవేమో అన్న ప్రచారం కూడా జరిగింది! మొత్తం మీద రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాభావం నెలకొనడంతో - ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలా అని ప్రభుత్వం కలవరపడింది. ఆగస్ట్ చివరి వరకు వర్షాలు కురవకపోతే కరువు ప్రాంతాలను ప్రకటిస్తామని ఇంతకుముందు ముఖ్యమంత్రి వైస్ ప్రకటించారు. ఎట్టకేలకు కష్టకాలంలో వరుణ దేవుడు రాష్ట్రంలోకి 'తిరిగి ప్రవేశించడం' అధికార పక్షానికి 'ఊరటే!' ఇంతకీ వరుణ దేవుడు అధికార పక్షమా... ప్రతి పక్షమా అంటే... రెండూ కాదు - ఆరుగాలం చెమటోడ్చే అన్నదాతల పక్షం!
News Posted: 18 August, 2009
|