మందుబాబుల పుణ్యం హైదరాబాద్ : రాష్ట్రంలో మందుబాబులు మస్తుగా తాగేసి మత్తులో జోగకపోతే ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయి ఉండేది. బొక్కసం ఖాళీ అయ్యి దివాళా తీసి ఉండేది. ప్రభుత్వం అలాంటి ప్రమాదంలో పడకుండా కాపాడింది మాత్రం మందుబాబులే. సంక్షేమ పధకాల అమల్లో మేమే గొప్పని చెప్పుకునే అవకాశాన్ని ప్రభుత్వాధినేతలకు అందించి పుణ్యాన్ని మూటగట్టుకున్నదీ మందుబాబులే. ఎందుకంటే అనేక కారణాల వల్ల కునారిల్లిపోతున్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దే మార్గాలు ప్రస్తుతం ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు రూపాయలు 9,703 కోట్ల రూపాయల ఆదాయ లక్ష్యానికి 8,090 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే ఖజానాకు చేరింది. మొత్తం తొలి మూడు నెలలకు వసూళ్ళు, లక్ష్యంతో పోల్చుకుంటే 1,612 కోట్ల రూపాయల మేరకు తగ్గింది.
ఈ మూడు నెలల్లో ఎక్సైజ్, వాణిజ్య, రవాణా శాఖల వసూళ్ళు ఖజానాకు కాస్త ఊరట కలిగించాయి. గనులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు లక్ష్యాల సాధనలలో చతికిలపడ్డాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ శాఖలు వసూళ్ళు తిరోగమన వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయ లక్ష్యం రూపాయలు 838 కోట్లకుగాను రూపాయలు 550 కోట్ల మాత్రమే లభించింది. గత రెండు సంవత్సరాల్లో 2008 జూన్‌లో 867 కోట్ల రూపాయలు, 2007 జూన్‌లో 735 కోట్ల రూపాయిలుగా రిజిస్ట్రేషన్ ఆదాయం నమోదుకావడం విశేషం. తొలి త్రైమాసికంలో గనుల శాఖ రెవెన్యూ లక్ష్యం 544 కోట్ల రూపాయలకు గాను ఇది 370 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిర్థేశిత లక్ష్యంలో 68 శాతం మాత్రమే చేరుకుంది. అటవీ, ఇతర రెవెన్యూ శాఖలు ఆదాయ లక్ష్యాల సాధనలో వెనుకపడ్డాయి.
జూన్ నెలలో మద్యం విక్రయ లక్ష్యం 810 కోట్ల రూపాయలు కాగా అది 880 కోట్ల రూపాయలకు దూసుకుపోయింది. తొలి తైమాసికంలో ఎక్సైజ్ విక్రయాల ద్వారా 1,183 కోట్ల రూపాయలకు 1,161 కోట్ల రూపాయలు నమోదైంది. జూలై నెలలో కూడా ఎక్సైజ్ విక్రయాలు జోరుగానే సాగడంతో ఆదాయం కూడా సంతృప్తికరంగానే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ వసూళ్ళ లక్ష్యం 5,760 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలతో ఎక్సైజ్ ఆదాయం 5,752 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో వాణిజ్య పన్నుల వసూళ్ళ లక్ష్యం 6,424 కోట్ల రూపాయలకు గాను, ఇది 5,472 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే సమయంలో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం 5,404 కోట్ల రూపాయలుగా నమోదైంది.
News Posted: 19 August, 2009
|