గ్యాస్ సంస్థ ఏర్పాటు హైదరాబాద్ : ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఓఎన్ జీసీ తరహా సంస్థను ఏర్పాటు చేసింది. చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ, వెలికితీత కార్యకలాపాలను చేపట్టే బాధ్యతను ఈ సంస్థకు అప్పగించారు. ఎపి గ్యాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిజిఐసి) పేరుతో ఏర్పాటైన ఈ సంస్థలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) 51 శాతం, పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఎపి జెన్కో) 49 శాతం పెట్టుబడులతో సంయుక్త భాగస్వాములుగా ఉంటాయి. మంగళవారం ఇక్కడ సమావేశమైన ఎపిఐఐసి డైరెక్టర్ల బోర్డు సంయుక్త భాగస్వామ్య సంస్థ ఏర్పాటును ఆమోదించినట్టు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
చమురు, గ్యాస్ అన్వేషణ ఉత్పత్తి రంగాల్లో కార్యకలాపాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఒక ప్రత్యేక సంస్థను ప్రారంభించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ వి.కె.సిబాల్ సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎపిజిఐసి సంస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని కెజిబేసిన్ పరిధిలో సాధ్యమైనన్ని ఆయిల్, గ్యాస్ నిల్వల్ని వెలికితీయాలన్నదే ఈ కొత్త సంస్థ ప్రధాన లక్ష్యమని ప్రకటన పేర్కొంది. అలాగే ప్రస్తుతం సిటీ గ్యాస్ పంపిణీతో పాటు హైదరాబాద్, విజయవాడ, కాకినాడలో పారిశ్రామిక గ్యాస్ పంపిణీ చేపట్టిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఐదుశాతం ఈక్విటీ పొందాలన్న ప్రతిపాదనను కూడా ఎపిఐఐసి బోర్డు ఆమోదించింది. ఎపిఐఐసి భాగస్వామ్యం వల్ల తమ గ్యాస్ పైప్ లైన్ నెట్ వర్క్ కోసం భాగ్యనగర్ గ్యాస్ సంస్థకు కీలక ప్రాంతాల్లో స్థలం కేటాయింపు జరిగే అవకాశం ఉంది.కాగా, ఎపిఐఐసి చైర్మన్ బి.పి.ఆచార్య అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ సమావేశంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బి.శామ్ బాబ్, రోడ్లు భవనాల శాఖ ప్రిన్స్ పల్ కార్యదర్శి తిశ్య చటర్జీ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 19 August, 2009
|