గ్యాస్ పైపులు ఆలస్యమే హైదరాబాద్ : ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేందుకు ఉద్దేశించిన కృష్ణా, గోదావరి బేసిన్ గ్యాస్ పైప్ లైన్ నెట్ వర్క్ లిమిటెడ్ (కెజిజిఎన్ ఎల్) ను నెలకొల్పాలన్న ప్రతిపాదన ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశం కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి గ్యాస్ పైప్ లైన్, కంపెనీ నెట్ వర్క్ కోసం లక్ష కోట్ల రూపాయల విలువైన కెజిజిఎన్ ఎల్ ఏర్పాటుకు ఒప్పందం ఊహించిందానికన్నా ఎక్కువగా ఆలస్యమవుతోంది.
వాస్తవానికి నెట్ వర్క్ భాగస్వాముల మధ్య విధి విధానాలపై ఇంకా అంగీకారం కుదరనందున ఒప్పందం ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. అధిక వాటాదారుల పెత్తందారీ పోకడలను నియంత్రించేందుకు, అధిక ధరలను అడ్డుకునేందుకు ఈ మేరకు నియమాలు అవసరమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. వీలైనంత త్వరలో ఒప్పందం కుదిరే ఈ నెట్ వర్క్ లో సింహ భాగం - 67 శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ ఐ ఎల్) కు ఉంటుంది. మిగిలిన 33 శాతంలో ఐడిఎఫ్ సి ప్రైవేట్ ఈక్విటీ, గుజరాత్ గ్యాస్ పెట్రోలియం కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ (ఐఎన్ సిఏపి) లకు 11 శాతం వంతున భాగస్వామ్యం ఉంటుంది. మొత్తం లక్ష కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులో ఒక్క హైదరాబాద్ కే 3500 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. ఈ నెట్ వర్క్ కు ప్రతిపాదన అంకురించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సలహాదారు సోమయాజులు మాట్లాడుతూ ఈ నెట్ వర్క్ ఏర్పాటు వల్ల రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో జాప్యం నివారణతో పాటు గ్యాస్ ధర గణనీయంగా తగ్గుతుందన్నారు. రాష్ట్రంలోని 23 పట్టణాల్లో గ్యాస్ సరఫరాకు ఈ నెట్ వర్క్ నిర్మాణం తోడ్పడుతుందన్నారు. కేజీ గ్యాస్ బేసిన్ నుంచి మార్చి 24నే గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైంది. గ్యాస్ ధర విషయంలో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య విభేదాలు ఉన్నాయి. సుప్రీం కోర్టులో వివాదం కూడా నడుస్తోంది. ప్రభుత్వం కూడా ధరల వ్యవహారంలో ఒక కమిటీనీ నియమించింది.
News Posted: 19 August, 2009
|