పిఆర్పీ బర్తడే సందడేది? తిరుపతి : ఏడాది క్రితం... ఆగస్ట్ 26న - తిరుపతి వేదికగా ఆవిర్భవించిన నూతన రాజకీయ పక్షం ప్రజారాజ్యం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించింది. ఓటర్లందరిలో ఆసక్తి కలిగించింది. రాజకీయ పరిశీలకుల అంచనాలకైతే అంతేలేదు. గత ఎన్నికల్లో చిన్న చిన్న రాజకీయ పక్షాలు ప్రజారాజ్యంతో పొత్తుకోసం వెంపర్లాడాయి... పార్టీ వ్యవస్థాపకుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుల అభిమానుల ఆనందోత్సాహాలకు అంతేలేదు.
కానీ ఎన్నికల ఫలితాల తరువాత మునుపటి ఉత్సాహం మసకబారింది. ఈ ఏడాది ఆగస్ట్ 26న పార్టీ తొలి వార్షికోత్సవం ఉంటుందా? ఉండదా అన్న విషయమే అనుమానంగా మారింది. చిత్తూరు జిల్లా నాయకులు కొందరు 'పార్టీ వార్షికోత్సవం గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదు' అని చెప్పారు. జిల్లాలో కీలకమైన నేతలు చదలవాడ కృష్ణమూర్తి, ఎన్.వి.ప్రసాద్, హరిప్రసాద్ తదితరులు కొన్ని నెలులుగా పార్టీ కార్యక్రమాలపై ఆసక్తి చూపడం లేదు. ఒక సీనియర్ నాయకుడు మాట్లాడుతూ కార్యకర్తల, అభిమానుల్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదన్నారు. పార్టీలో వలసలపట్ల కార్యకర్తలు కలవరపడుతున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పార్టీ కేవలం 18 స్థానాలే సాధించడం కూడా కార్యకర్తల్లో నిరుత్సాహాం పెరగడానికి కారణమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
'తిరుపతి ప్రజల్లో మెగాస్టార్ కు గతంలో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. ప్రజారాజ్యం వర్గాలకు కష్టం అనిపించినా ఇదే నిజం' అని రాజకీయ విశ్లేషకుడొకరు పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకుడొకరు మాట్లాడుతూ స్థానికేతర వ్యక్తిని శాసనసభ్యునిగా ఎన్నుకొని పొరపాటు చేశామని తిరుపతి ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిరంజీవి తాను స్థానికేతరుడిని అన్న ముద్ర తొలగించుకోవడానికి గడచిన నాలుగు నెలల్లో చిరంజీవి మూడుసార్లు నియోజకవర్గంలో పర్యటించినా... ప్రజల్లో మాత్రం ఇమేజ్ పెరిగినట్లు కనిపించలేదు.
ఎం ఎల్ ఏలు నాతోనే : చిరు
ప్రజారాజ్యం శాసనసభ్యులంతా తనతోనే ఉన్నారని పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రకటించారు. శాసనసభ్యులు శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఇంకొందరు పార్టీ వీడనున్నట్టు వచ్చిన వార్తలను ఖండించారు. తమ పార్టీ... కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశాలకు తమ పార్టీయే సరైన ప్రత్యామ్నాయమన్నారు.
News Posted: 20 August, 2009
|