ఇంజనీరింగ్ పై తగ్గిన మోజు హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులకు మొహం మొత్తిందా? పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజినీరింగ్ విద్యా సంస్థలు తమ విద్యాబోధనతో విద్యార్థులను ఆక్టటుకోలేక పోతున్నాయా? అంటే ఈ ఏడాది జరిగిన కౌన్సెలింగ్ తీరును చూస్తే అవుననిపిస్తోంది. వర్తమాన విద్యాసంవత్సరంలో 3.2 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ ప్రవేశ పరీక్షల్లో ఇంజినీరింగ్ కు అర్హులయ్యారు. కౌన్సిలింగ్ ముగిసేనాటికి 1.62 లక్షల మంది విద్యార్థులే సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యారు. ఈ విధంగా విద్యార్థుల సంఖ్య తగ్గడం కొత్త కాలేజీల యాజమాన్యాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కోట్లు ఖర్చుచేసి నెలకొల్పిన కళాశాలలు మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
గతేడాది ఇంజినీరింగ్ విభాగంలో 3.4 లక్షల మంది సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యారు. గత ఏడాది మొదటి రెండు రోజుల్లోనే 10 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, ఈ ఏడాది కేవలం 1200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందుకు ఆర్థికమాంద్యంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరవే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా ఐటీ, ఎలక్ట్రానిక్ కోర్సుల పట్ల విద్యార్థుల క్రేజ్ తగ్గిందని భావించిన కొన్ని కళాశాలల్లో - ఆయా కోర్సుల స్థానంలో సంప్రదాయ కోర్సులను ప్రవేశపెడుతున్నారు.
News Posted: 22 August, 2009
|