ఐఐఎస్ సి నంబర్ వన్ బెంగళూరు : దేశంలోని 67 అగ్రశ్రేణి సైన్స్ ఇన్ స్టిట్యూట్ లలో బెంగళూరు ఐఐఎస్ సిని నంబర్ వన్ ఇంజనీరింగ్ / టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ గా ఎంపిక చేశారు. ఐఐటి కాన్పూర్ రెండవ స్థానం ఆక్రమించింది. ఐఐటి బొంబాయి, ఐఐటి ఖరగ్ పూర్, ఐఐటి ఢిల్లీ వరుసగా మూడవ, నాలుగవ, ఐదవ స్థానాలలో నిలిచాయి.
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, డెవలప్ మెంట్ స్టడీస్ న్యూఢిల్లీ సంస్థలకు చెందిన స్కాలర్లు గగన్ ప్రతాప్, బి.ఎం. గుప్తా ఈ ర్యాంకింగ్ లను రూపొందించారు. వీటిని 'కరెంట్ సైన్స్' పత్రికలో ప్రచురించారు. టాప్ టెన్ లో చోటు చేసుకున్న ఇతర ఇన్ స్టిట్యూట్ లలో జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం ఆరవ ర్యాంకులోను, ఐఐటి మద్రాసు ఏడవ ర్యాంకులోను, ఐఐటి రూర్కీ ఎనిమిదవ ర్యాంకులోను, అణ్ణా విశ్వవిద్యాలయం తొమ్మిదవ ర్యాంకులోను, ఐఐటి గౌహతి పదవ ర్యాంకులోను ఉన్నాయి.
స్కోపస్ ఇంటర్నేషనల్ మల్టీ-డిసిప్లినరీ, బైబ్లియోగ్రాఫికల్ డేటా బేస్ లో 1999, 2008 మధ్య అందుబాటులో గల రీసర్చ్ రికార్డు, ప్రచురణలు, ప్రశంసాపత్రాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ లను రూపొందించారు. ప్రచురణలు, ప్రశంసాపత్రాల విషయంలో దేశంలోని ఇతర సైన్స్ విద్యా సంస్థలపై ఐఐఎస్ సిదే పైచేయి అనే ఈ డేటా సూచిస్తున్నది.
ఆ పదేళ్ళ కాలంలో విశ్వవిద్యాలయం రంగం కన్నా 67 అగ్రశ్రేణి ఇంజనీరింగ్ ఇన్ స్టిట్యూట్ లు మెరుగుగా ఉన్నాయని, విశ్వవిద్యాలయ రంగంలో 59685 పత్రాలు ప్రచురించగా ఆ 67 ఇన్ స్టిట్యూట్ ల నుంచి 75166 పత్రాలు వెలువడ్డాయని స్కాలర్లు తెలియజేశారు.
సంఖ్య, పని తీరు (ప్రమాణం, పరిమాణం కలగలిపి)ని బట్టి ఒక గ్రూపుగా ఐఐఎస్ సి, ఐఐటిలు ఇతర గ్రూపులపై అంటే యూనివర్శిటీ, డీమ్డ్ యూనివర్శిటీ, ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్ఐటిలు/ ఆర్ఇసిలు, ఐఐఐటిల కన్నాఆధిక్యంలో ఉన్నాయని కూడా వారి పరిశోధన సూచిస్తున్నది. తక్కువ ప్రచురణలు, ప్రశంసాపత్రాలకు గాను ఐఐఐటిలు ఒక గ్రూపుగా చివరి స్థానంలో ఉన్నాయి.
News Posted: 25 August, 2009
|