'మొగలుల అడుగుజాడల్లో' జమ్ము : కాశ్మీర్ లోకి ప్రవేశించడానికి మొగల్ చక్రవర్తులు ఉపయోగించిన మార్గం వెంట భూతల స్వర్గం యాత్ర చేయడానికి సంసిద్ధులు కండి. 2010ని 'జమ్ము కాశ్మీర్ సందర్శన' సంవత్సరంగా జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో రాష్ట్రాన్ని సందర్శించేవారికి రాష్ట్ర టూరిజం శాఖ మరిన్ని సదుపాయాలు కల్పించబోతున్నది.
వచ్చే సంవత్సరానికల్లా రాజౌరి, పూంచ్ జిల్లాలలో పీర్ పంజల్ పర్వత శ్రేణి పొడుగునా యాత్రా సౌకర్యాలను అబివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మొగలాయీలు కాశ్మీర్ లోయలోకి ఈ మార్గం ద్వారానే ప్రవేశించారని విశ్వసిస్తున్నారు. మొగలులు నౌషేరా వద్ద జమ్ము కాశ్మీర్ లోకి ప్రవేశించారని భావిస్తున్నారు. వారు ఆతరువాత చింగుస్, రాజౌరి, ఠన్నా మండి, చండీమఢ్ మీదుగా సాగారు. వారు అలా సాగుతూ పోషియానా, గుంగాడియన్, షోపియాన్ లలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారని భావిస్తున్నారు.
'చరిత్ర ప్రకారం మొగల్ చక్రవర్తి జహంగీర్ భార్య నూర్జహాన్ జమ్ముకు దాదాపు 240 కిలో మీటర్ల దూరంలోని పూంచ్ జిల్లాలో కొండరాళ్ళ దిగువన బయటకు కనిపించని జలపాతం 'నూరీ చాంబ్'లో స్నానం చేస్తుండేది' అని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. బ్లోరియా తెలియజేశారు. ఆయన ఈ ప్రాంతంపై విస్తృతంగా అధ్యయనం జరిపారు. 'జలపాతం కింద ఒక రాయిలో రెండు అడుగుల పొడుగు, రెండు అడుగుల వెడల్పు ఉన్న ఒక అర ఇప్పటికీ ఉన్నది. మహారాణి వస్త్రధారణ సమయంలో ఉపయోగించేందుకై ఒక అద్దాన్ని ఆ అరలో ఉంచేవారు' అని బ్లోరియా తెలిపారు. అక్బర్ కుమారుడైన జహంగీర్ 1605 నుంచి 1627 వరకు భారతదేశాన్ని పాలించాడు. కళా పోషకుడుగా, కళాభిమానిగా జహంగీర్ ఖ్యాతి గడించాడు.
'మొగలుల అడుగుజాడల్లో' అనే ఈ పథకం కింద ఈ రూట్ లో ప్రచార కార్యక్రమాలు వచ్చే సంవత్సరం రాజౌరి - పూంచ్ రంగంలో ఒక కారు ర్యాలీతో మొదలవుతాయని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి నవాంగ్ రిగ్జిన్ 'హిందుస్థాన్ టైమ్స్' పత్రిక విలేఖరితో టెలిఫోన్ లో చెప్పారు.
జమ్ము కాశ్మీర్ లో టూరిజం అంటే ఇప్పటి వరకు దాల్ సరస్సులో పడవ ప్రయాణం, గుల్మార్గ్ లో గుర్రపు స్వారీ, బాబా ఋషి, ఐష్ముకమ్, బాబా షకూర్-ఉద్-దీన్ వంటి సూఫీ ఆరాధనా మందిరాల సందర్శనలకే పరిమితం అవుతోంది. కాగా, ఈ సంవత్సరం రాష్ట్రాన్ని సందర్శించిన యాత్రికుల సంఖ్య ఇప్పటికే నాలుగు లక్షలు దాటింది. 2008లో రాష్ట్రాన్ని నాలుగు లక్షల మంది సందర్శించారు. ఇంకా రెండు సీజన్ లు - అంటే శరదృతువు, శీతాకాలం ముగియవలసి ఉన్నందున రాష్ట్రానికి వచ్చే యాత్రికుల సంఖ్య కొత్త రికార్డును చేరవచ్చు. కాగా, 'కాశ్మీర్ లోకి మొగలులు ప్రవేశించిన మరొక మార్గాన్ని కనుగొనడం రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహకరం కాగలదు' అని కాశ్మీర్ ట్రావెల్ ఏజెంట్ల సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు నజీర్ బక్షి పేర్కొన్నారు.
News Posted: 26 August, 2009
|