ప్లాస్టిక్ నోట్లే శరణ్యమా? న్యూఢిల్లీ : అచ్చంగా అసలైన నోట్లలా కనిపించే నకిలీ ఐదొందలు, వెయ్యి రూపాయల విచ్చలవిడి చెలామణీతో కంగుతిన్న కేంద్రం ఇప్పుడు ప్లాస్టిక్ నోట్ల తయారు గురించి ఆలోచిస్తోంది. పాలీమర్ (ప్లాస్టిక్) తో కరెన్సీ నోట్లను రూపొందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆస్ట్రేలియా అభివృద్ధి చేసింది. పాలీమర్ తో నకిలీలు తయారు చేయడం అసాధ్యమని తేలడంతో భారత ప్రభుత్వం పాలీమర్ నోట్లను చెలామణీలోకి తేవాలన్న దిశగా ప్రయత్నాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంకు అధికారులు, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని నాణేలు, నోట్ల విభాగం అధికారులు గత కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారు. కానీ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.
భారత్ కరెన్సీ 2005-06 సీరీస్ వెయ్యినోట్ల డిజైన్ లీకయి అసలూ, నకిలీ గుర్తించలేని విధంగా నోట్ల తయారై రావడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. సెక్యూరిటీ త్రెడ్ తో సహా నకిలీ నోటు రావడం అసలు ఊహకే అందని విషయమని నిపుణులు చెబుతున్నారు. గవర్నర్ వైవి రెడ్డి సంతకంతో ఉన్న 2 ఎక్యూ, 8 ఎసి సీరీస్ నోట్లు నకిలీవని వాటిని గుర్తించాలని రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే అన్ని ఆర్ధిక సంస్థలను హెచ్చరించింది.
పాలీమర్ నోట్లు మన్నిక కూడా ఎక్కువగా ఉంటుందని, ప్రత్యేకమైన పాలీమర్ ను వినియోగించడంతో పాటు నోటుకు రక్షణా పైపూత ఉంటుందని, అందువల్ల దానికి చెమ్మ అంటదని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంకుతో సంయుక్త భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా భారత్ కరెన్సీ నోట్ల ముద్రణ చేపట్టాలని ప్రతిపాదనను రూపొందిస్తున్నారు. పాలీమర్ నోటులో సూక్ష్మాతి సూక్ష్మమైన పారదర్శక ప్రదేశాలను సృష్టించవచ్చని, అందువలన వాటికి నకిలీని రూపోందించడం చాలా కష్టమని వారు వివరిస్తున్నారు. అలానే వెలుగు కింద పెడితే రంగులు మారతాయని, అలానే కంటికి ఉబ్బెత్తుగా, లోతుగా కనిపించే డిజైన్ సృష్టించవచ్చని, ఈ పద్దతులన్నీ నకిలీని నిరోధించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు.
ఈ ప్లాస్టిక్ నోట్లను ఇప్పటికే 20 దేశాలు వినియోగిస్తున్నాయని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రొమేనియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, మెక్సికో, సింగపూర్, శ్రీలంక దేశాల్లో ప్లాస్టిక్ నోట్లు చెలామణీలోకి వచ్చిన తరువాత నకిలీల బెడద తగ్గిపోయిందని ఆయా కేంద్ర బ్యాంకులు చెబుతున్నాయి. అయితే అమెరికా, జపాన్, జర్మనీ లాంటి పెద్ద దేశాలు ప్లాస్టిక్ నోట్ల జోలికి పోకపోవడం భారత్ ను ఆలోచింపచేస్తోంది. కరెన్సీ ముద్రించడానికి పాలీమర్ వాడినా, కాగితం వాడినా దానిలో నకిలీ నిరోధానికి వినియోగించే సెక్యూరిటీ పద్దతులు పటిష్టంగా ఉండాలని, లేకపోతే ఏ పదార్దం వాటినా ప్రయోజనం ఉండదని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News Posted: 27 August, 2009
|