చైనీస్ ఫోన్లపై నిషేధం? న్యూఢిల్లీ : జాతీయ భద్రతకు ముప్పు కలగవచ్చునని గూఢచారి సంస్థల నుంచి నివేదికలు అందడంతో ప్రభుత్వం సరిహద్దు రాష్ట్రాలలోను, నక్సల్స్ ప్రాబల్యం గల రాష్ట్రాలలోను చైనీస్ పరికరాలను ప్రైవేట్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు ఉపయోగించడంపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆగస్టు 28న టెలికామ్ శాఖ కార్యదర్శి సిద్ధార్థ బెహురాతో టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)ల సమావేశాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ (డిఒటి) ఏర్పాటు చేసింది.
'భద్రతకు సంబంధించిన విషయాలలో పాటు దేశంలో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో చైనీస్ పరికరాల వాడకం వల్ల ఎదురవుతున్న ముప్పును కూడా ఈ సమావేశంలో చర్చించగలరు' అని డిఒటి సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. హోమ్ మంత్రిత్వశాఖ నివేదిక ఒకటి ఈ సమావేశపు అజెండాలో ఒక అంశం. సరిహద్దు ప్రాంతాలలో చైనీస్ పరికరాలను ఉపయోగించరాదని ఈ నివేదిక సూచిస్తున్నదని, ఫలితంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) చైనీస్ పరికరాల కోసం ఆర్డర్లు పంపడాన్ని ఇప్పటికే నిలిపివేసిందని ఆ అధికారి తెలిపారు. ఈ ఆంక్షలను ప్రైవేట్ ఆపరేటర్లకు కూడా విస్తరించాలని డిఒటి యోచిస్తున్నది.
సైబర్ దాడికి వీలు కల్పించే సాధనాలు గాని, విండోలు గాని చైనీస్ టెలికామ్ ఉపకరణాలలో నిక్షిప్తమై ఉండవచ్చునని, ఆ పరికరాలను సమకూర్చిన సంస్థ కోరుకున్నట్లయితే వాటిని పూర్తిగా పని చేయకుండా చేయవచ్చునని, లేదా పూర్తిగా పాడు చేయవచ్చునని గూఢచారి సంస్థల నుంచి హెచ్చరికలు వచ్చాయి.
ప్రైవేట్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు ఇతర సంస్థలతో పాటు రెండు చైనీస్ సంస్థలు హ్వావెయి, జడ్ టిఇలు ఉత్పత్తి చేసిన జిఎస్ఎం పరికరాలను పంపిణీ చేస్తున్నాయి. హ్వావెయి సంస్థ బెంగళూరులో తమ ఆర్ అండ్ డి కేంద్రం ఏర్పాటుపై 200 మిలియన్ల డాలర్లు (రూ. 980 కోట్లు) వెచ్చించింది. 'మా పరికరాలు, సొల్యూషన్లు కచ్చితంగా ప్రపంచ భద్రతా ప్రమాణాల మేరకు ఉంటున్నాయి' అని హ్వావెయి సంస్థ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. జడ్ టిఇ సంస్థ సిఎండి డి.కె. ఘోష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'మేము మొదట భారతీయులం. తరువాతే చైనీస్ సంస్థ ఉద్యోగులం. దేశ భద్రతే మా ప్రధాన ధ్యేయం' అని చెప్పారు.
News Posted: 27 August, 2009
|