రైళ్లలో గ్రీన్ టాయిలెట్లు న్యూఢిల్లీ : దేశంలో నడిచే మొత్తం 8984 ప్రయాణికుల రైళ్ళ బోగీలలో 'గ్రీన్ టాయిలెట్లు' అమర్చాలని సంకల్పించిన రైల్వే శాఖ ఇందు కోసం త్వరలో ప్రపంచవ్యాప్తంగా టెండర్లు పిలవనున్నది. పర్యావరణ అనుకూల బయొలాజికల్ టాయిలెట్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం వచ్చే సంవత్సరం ప్రారంభం కావలసి ఉందని రైల్వే మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు పేరు వెల్లడి చేయకూడదనే షరతుపై ఒక పత్రిక విలేఖరితో చెప్పారు. మీడియాతో మాట్లాడేందుకు ఆయనకు అధికారం లేదు.
దూర ప్రాంతపు రైలు ఢిల్లీ - రేవా ఎక్స్ ప్రెస్ ను బయొలాజికల్ టాయిలెట్లతో నడపడంపై గత మే వరకు ఏడాది పాటు జరిపిన పరీక్షలు విజయవంతం కావడంతో పరిశోధన, డిజైన్ సంస్థ (ఆర్ డిఎస్ఒ) రూపొందించిన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని మంత్రిత్వశాఖ భావించింది. ఈ టెక్నాలజీతో మానవ విసర్జితాలను రైలులోని రసాయనికంగా శుద్ధి చేయవచ్చు. ఈ టెక్నాలజీ మానవ విసర్జితాన్ని చిన్న చిన్న అణువులుగా చేస్తుంది. వాటిని చివరకు నిరపాయకర వాయువులుగా, ద్రవాలుగా మార్చడానికి ఇది ఉపకరిస్తుంది. వాటిని ఆ తరువాత కొద్దికొద్దిగా రైలు పట్టాలపై జారవిడుస్తారు.
వైమానిక రంగంలో ప్రధానంగా ఉపయోగించే వ్యాక్యూమ్ రిటెన్షన్ టాయిలెట్లకు సంబంధించిన పనితీరు ప్రమాణాలను కూడా ఆర్ డిఎస్ఒ రూపొందించింది. అటువంటి టాయిలెట్లు వ్యర్థాన్ని వ్యాక్యూమ్ సాయంతో ఖాళీ చేసే పద్ధతిపై పని చేస్తాయి. దానిని స్టోరేజ్ ట్యాంక్ లో నిల్వ చేసి చివరకు టెర్మినల్ లలో ప్రత్యేక సాధనం ద్వారా ఖాళీ చేస్తారు.
'బహుశా రైల్వే శాఖ ఈ రెండు పద్ధతులతో ప్రయోగం నిర్వహించవచ్చు. అయితే, ఈ పథకాలు చివరకు పురోగమిస్తుండడం అత్యంత ప్రధానం' అని ఆ అధికారి పేర్కొన్నారు.
News Posted: 27 August, 2009
|