చక్ర బంధంలో అద్వానీ!
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీకి కాలం కలిసి వస్తున్నట్లు లేదు. 2004లో లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత 'జిన్నా దేశ భక్తుడు' అని పాకిస్తాన్ లో వ్యాఖ్యానించినప్పటి నుంచి ఆయన ఎదురీత ప్రారంభమైంది. తాజాగా 'జిన్నా'పై రాసిన పుస్తకం కారణంగా మరో భాజపా నేత జశ్వంత్ సింగ్ బహిష్కరణకు గురైన నేపథ్యంలో కూడా అద్వానీ కేంద్ర బిందువుగా మారారు. 2006లో జిన్నా దేశభక్తుడని వ్యాఖ్యానించినపుడు పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన అద్వానీని, 2009 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఏర్పడిన పరిణామాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష నేత గా కూడా ఉండరాదని అద్వాని నిర్ణయించినా, ద్వితియశ్రేణి నాయకత్వంలో అనైక్యత కారణంగా కొనసాగవలసి వచ్చింది. దీంతో ఆర్ పీఎస్ కూడా మౌనం దాల్చింది.
అద్వానీ పాత్ర తగ్గుతోందనే దానికి చిహ్నంగా ఆయన తల పెట్టిన రథ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటన రావడమే. లోక్ సభ ఎన్నికల తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని పునరుద్ధరించాలని భావించి అద్వాని ఈ పర్యటనకు నిర్ణయించుకున్నారు. తాజాగా పార్టీ నాయకత్వాన్ని యువకులకు అప్పగించాలన్నది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అభిప్రాయం. పార్టీని ప్రస్తుత అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కూడా సమర్థవంతంగా నడపడం లేదన్న అభిప్రాయం 'సంఘ్' లో ఉంది. అద్వానీ, రాజనాథ్ లు పార్టీని లోక్ సభ ఎన్నికల్లో గెలిపించకలేకపోగా, సంక్షోభంలోకి నెట్టారని భావిస్తోంది. పార్టీలో క్రమశిక్షణ పెంచాలని భావించే ఆర్ ఎస్ ఎస్ జశ్వంత్ పై వేటువేసింది. తద్వారా తప్పుకోవాలన్న సంకేతాన్ని అద్వానికి ఇచ్చింది. దీనికి తోడు 1999 లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని కాంథహార్ కు హైజాక్ చేసిన ఉదంతంలో బందీలైన తీవ్ర వాదుల అప్పగింత వ్యవహారం అద్వానీకి కూడా తెలుసునని ఆరోపణలు వచ్చాయి. కాబినెట్ మాజీ సహచరులు జశ్వంత్ సింగ్, అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, జార్జ్ ఫ్రెర్నాడెంజ్ లకు తోడుగా అప్పటి జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా కూడా బందీల అప్పగింత అద్వానికి తెలుసని చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. మరోవైపు ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ 'నిజాలను దాచిన అద్వానీ జాతికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేస్తోంది.
రథయాత్రలతో తనకంటూ ఉన్న గుర్తింపుతో భాజపా ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడిన అద్వానీ... ప్రస్తుతం చక్ర బంధంలో బిగుసుకున్నారు. అటు ఆర్ ఎస్ ఎస్, మాజీ కేబినెట్ సహచరులు, కాంగ్రెస్ ల మధ్య చిక్కుకున్నారు. గతంలో హవాలా కేసులో తన పేరు నిందితుల్లో ఉన్నందుకే లోక సభకు రాజీనామా చేసి, నిర్దోషిగా విముక్తుడైన తర్వాతే ఎన్నికల్లో అద్వానీ పోటీ చేశారు. ఇటువంటి ఘనత గలిగిన అద్వానీ ప్రస్తుతం తన బాధ్యతల నుంచి తప్పుకుంటారా?, కొత్త నాయకత్వానికి బాటలు వేస్తారా? అన్నది శేష ప్రశ్నగా మిగిలింది.
News Posted: 28 August, 2009
|