ఐటి పరిమితి పెరగవచ్చు న్యూఢిల్లీ : దాదాపు నెల క్రితం వెలువరించిన ప్రత్యక్ష పన్నుల నియమావళి (డిటిసి) ముసాయిదాలో ప్రతిపాదించినట్లుగా వ్యక్తిగత ఆదాయంపై మౌలిక పన్ను మినహాయింపు పరిమితిని ఏడాదికి రూ. 1.6 లక్షల నుంచి రూ. 2.25 లక్షలకు ఆర్థిక మంత్రిత్వశాఖ హెచ్చించే అవకాశం ఉంది. ప్రభుత్వంలోనే గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కాగలదనే భయం వేధిస్తుండగా ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి) ఈ పరిమితిన పెంచాలని తీవ్రంగా యోచిస్తున్నది. ఉద్యోగుల జీతానికి ఇతర భత్యాలను కూడా కలిపితే వారి మొత్తం వార్షిక ఆదాయం ప్రత్యక్ష పన్నుల నియమావళిలో ప్రతిపాదించిన రూ. 1.6 లక్షల పరిమితిని కచ్చితంగా దాటుతుంది.
'మాకు ఇప్పటికే దీనిపై నివేదిక అందింది. మేము ఈ మార్పు గురించి ఆలోచిస్తున్నాం' అని రెవెన్యూ శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. గృహవసతి సౌకర్యాలు, ఆరోగ్య ఖర్చులు వంటి భత్యాలను కలిపితే ప్రాథమిక స్థాయిలే వేతనాలు ఏడాదికి రూ. 1.6 లక్షలు దాటుతాయి. 'ఈ వర్గంవారి పొదుపు మొత్తాలకు దీని వల్ల గండి పడవచ్చు. ప్రత్యక్ష పన్నుల నియమావళి ఉద్దేశం కచ్చితంగా ఇది కాదు' అని ఆ అధికారి వివరించారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో ప్రభుత్వంలో ప్రాథమిక స్థాయి ఉద్యోగులు నెలకు రూ. 10 వేల వరకు ఆర్జిస్తున్నారు. 'ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఎ), లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్ టిసి), వైద్య ఖర్చులు చేరిస్తే సాలుకు రూ. 1.2 లక్షలు ఆర్జిస్తున్న వ్యక్తికి పన్ను విధించదగు ఆదాయం రూ. 2 లక్షలకు పెరగవచ్చు' అని ఆ అధికారి చెప్పారు. ఈ నియమావళిని ఆచరణలోకి తీసుకువచ్చినట్లయితే ఈ కొత్త పరిమితి 2011 -12 నుంచి అమలులోకి రావచ్చు.
ప్రస్తుత రూపంలో ఈ ముసాయిదా నియమావళి రూ. 1.6 లక్షల లోపు జీతం వచ్చే వ్యక్తులకు పన్ను నుంచి మినహాయించాలని ప్రతిపాదిస్తున్నది. మధ్య ఆదాయ వర్గం (ఎంఐజి) వారికి ఏడాదికి రూ. 1.6 లక్షలు, రూ. 10 లక్షలు మధ్య జీతం వస్తున్నది. దీనిపై 10 శాతం పన్ను విధించవలసి ఉంటుంది. ఈ మార్పులు జరిగిన పక్షంలో మహిళలకు మినహాయింపు పరిమితి కూడా పెరుగుతుంది. మహిళల కోసం ప్రతిపాదించిన పరిమితి ఏడాదికి రూ. 1.9 లక్షలు. ఇది కూడా ఏడాదికి రూ. 2.5 లక్షలకు పెరగవచ్చు.
'ఈ చర్య వల్ల ఉద్యోగులు ఇతోధికంగా పొదుపు చేయడానికి వీలు కలుగుతుంది. ఉద్యోగుల చేతుల్లో మరింత డబ్బు కూడా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఆహార ధరల ద్రవ్యోల్బణం బాగా పెరిగిన దృష్ట్యా ద్రవ్యోల్బణానికి అనుగుణమైన ఆదాయం కలిగి ఉండడానికి ఇది ఒక మంచి మార్గం' అని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థకు చెందిన ప్రత్యక్ష పన్నుల విభాగం భాగస్వామి సుధీర్ కపాడియా అభిప్రాయం వెలిబుచ్చారు.
News Posted: 28 August, 2009
|