కమలంలో కల్చర్ చిచ్చు!
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో అంతర్గత పోరు గతంలో ఎన్నడూ లేని విధంగా ముదురు పాకాన పడింది. క్రమశిక్షణకు మారుపేరైన భాజపాలో ఇటీవల కాలంలో ముఖ్యంగా 2009లో లోక్ సభ ఎన్నికల తరువాత 'కట్టు' బాటు తప్పినట్లు కనిపిస్తోంది. అగ్రశ్రేణి నాయకుల మధ్య రగలిన విభేదాలు పార్టీ భవిష్యత్ ని విపరీతంగా ప్రభావితం చేస్తాయేమోనని పార్టీలో చిరకాలంగా పనిచేస్తున్న నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిన్నాపై పుస్తకం రాసినందుకే జశ్వంత్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరీ ప్రశ్నించారు. పార్టీ ద్వంద్వ వైఖరి పాటించిందని విమర్శించారు. అంతటితో ఆగుకుండా ఆయన అద్వానీ, అరుణ్ జెట్లీల పైనా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అయితే పార్టీ అరుణ్ శౌరీ విమర్శలపై చర్య తీసుకునేందుకు సిద్ధంగా లేరు. అగ్రనాయకులంతా పార్టీ ఇమేజ్ పరిరక్షణ మాటెలా ఉన్నా, తమ ప్రత్యర్థుల ఇమేజ్ పై బురద జల్లే పనిలో బిజీగా ఉన్నారు.
పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కూడా పరోక్షంగా వివాదానికి ఆజ్యం పోస్తున్నటే కనిపిస్తోంది. పార్టీకి గల 'గుర్తింపు'ని నాశనం చేస్తున్నారని మరో వర్గం ఆరోపిస్తోంది. ఏ వర్గం తోనూ 'అంటు' కట్టని కార్యకర్తలు పార్టీతో కుమ్ములాటలు అంతం కావాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టే 'బాధ్యత'ను ఆర్ ఎస్ ఎస్ అధిపతి మోహన్ భగవత్ చేపట్టాలని పార్టీ శ్రేయోభిలాషులు కోరుతున్నారు. ఇప్పటికే మోహన్ భగవత్ తరచూ మీడియాతో మాట్లాడుతున్నారు. తద్వారా పార్టీ నాయకత్వంపై ఆయన ఒత్తిడి పెంచుతున్నారు. పార్టీని 'దిద్దుకోవాలన్న' సందేశం ఆయన మాటల్లో పరోక్షంగా కనిపిస్తోంది.
పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఒక సీనియర్ నాయకుడు ఇలా వ్యాఖ్యానించారు... 'హిందూ'వాదం నుంచి పార్టీ బయటపడాలని ఒక వర్గం, హిందుత్వాన్ని 'పటిష్టం' చేసుకోవాలని మరో వర్గం సైద్ధాంతిక 'పట్టు' కోసం ప్రయత్నిస్తున్నాయి అని ఆ నాయకులు పేర్కొన్నారు. గతంలో రెండు స్థానాలకు పరిమితమైన స్థితి నుంచి క్రమేణా అందలాన్ని సాధించిన భారతీయ జనతా పార్టీకి ఇంకా దక్షిణాది రాష్ట్రాల్లో పునాధి ఏర్పడలేదు. కర్నాటకలో 19 స్థానాలు సాధించినా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో లోక్ సభ స్థానాలు సాధించలేదు. 2014 ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా భావిస్తున్న పార్టీ ఎటువంటి విధానాలతో ఇంకా తన మద్దతును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నదన్నది పార్టీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. కానీ నాయకులు మాత్రం పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం అలుముకుంది.
News Posted: 28 August, 2009
|