రాగి 'సంకట'మే!
హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పడిన బియ్యం ధరల పెరుగుదల సంక్షోభాన్ని నివారించేందుకు ప్రజలు కొత్త బియ్యం తినాలని రాగి సంకటి వంటివి అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ సలహా ఇచ్చారు. తాను దొడ్డ బియ్యం తింటున్నానని, మీరుకూడా తినండని మంత్రలకు కూడా సీఎం చెప్పారు. స్వామి బువ్వగా పిలిచే సన్నబియ్యంతో అన్నం తినడం అలవాటైన తరువాత జొన్నలు, సజ్జలు, రాగులు, ఒరిగలు తినడం ఎవరికైనా కష్టమే. 'పరమేశా గంగను విడుము... పార్వతి చాలున్ నీకు' అంటూ మహాదేవుణ్ణి వేడుకున్న మహాకవి శ్రీనాథుడు కూడా తన పల్నాడు పర్యటనలో 'సన్నన్నాయి సున్న సుమీ' అంటూ జొన్నన్నం తినడానికి చాలా కష్టపడ్డాడు. 'విషం తాగడంలో గొప్పతనం ఏముంది. జొన్నన్నం తిని చూడు' అంటూ పరమేశ్వరునితో 'సవాల్' విసిరాడు.
జొన్న సంకటి, రాగి సంకటి పోషక విలువల గురించి సీఎం ఎంతగా చెప్పినా వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో రెండు దశాబ్దాలకు పూర్వం రాయలసీమ, తెలంగాణలలో మెట్ట పంటలు - జొన్నలు, రాగులు తదితర తృణధాన్యాలు బాగా పండేవి. కానీ హరిత 'విప్లవం'తో ఈ పంటల స్థానాన్ని వరి ఆక్రమించింది. వరి కూడుకు అలవాటు పడ్డారు. రాగులు, జొన్నలు, ఒరిగలు, సజ్జలతో భోజనం చేస్తారన్న సంగతి సంకటి తింటున్న ప్రాంతాలను మినహాయిస్తే ఇతర ప్రాంతాల్లోని యువతరానికి తెలియనుకూడా తెలియదు.
'రాష్ట్రంలో విస్తారంగా నాణ్యత గల బియ్యం లభిస్తున్నాయి. ఏ ప్రాంతంలోనైనా ఇదే పరిస్థితి నెలకొంది' అని ఇక్రిసాట్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తృణధాన్యాలను ప్రజలు వినియోగించేందుకు జాతీయ పరిశోధనా సంస్థలు 'ఆహారమేళా'లు వంటివి నిర్వహించాల్సి ఉంటుంది. మరోసారి పాతకాలపు పౌష్టికాహారపు అలవాట్లను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పు కారణంగా తృణధాన్యాల్లో మనకున్న వారసత్వ సంపదను ఆయా ప్రాంతాలు కోల్పోయాయి. ఇది మనషుల ఆరోగ్యంపైనే కాదు మార్కెట్ పైనా ప్రభావం చూపుతోంది!
News Posted: 28 August, 2009
|