ఆగిరిపల్లి స్వామి ఆభరణాలేవి? ఆగిరిపల్లి (కృష్ణాజిల్లా): కృష్ణాజిల్లాలోని ఆగిరిపల్లిలో శ్రీ శోభనాచల వ్యాఘ్రలక్ష్మీ నరసింహస్వామికి చెందిన ఐదు కోట్లరూపాయల విలువ చేసే బంగారు ఆభరణాల అడ్రస్ దొరకడం లేదు. రాష్ట్రంలోని తొమ్మిది నరసింహస్వామి క్షేత్రాల్లో కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్రలక్ష్మీ నరసింహ స్వామి వార్ల దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో 5కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు గల్లంతయ్యాయన్న వదంతులతో ఆగిరిపల్లి అట్టుడికి పోతోంది.
1960లలో స్వామివార్ల మాఘమాస రథసప్తమి వేడుకలను 12 రోజులపాటు నిర్వహించే వారు. ఆ ఉత్స వాల్లో ఏడువారాల నగలతో పాటు మరిన్ని ఆభరణాలను అలంకరించేవారని తెలుస్తోంది. విలువైన ఆభరణాలకు రక్షణ లేకపోవడంతో వాటిని మద్రాసులోని ఓబ్యాంకు లాకర్‌లో భద్రపరిచినట్లు సమాచారం. లక్ష్మీనరసింహ స్వామి వారికి ధూప దీప నైవేద్యాలకోసం 1974లో కొంత బంగారాన్ని అమ్మగా వచ్చిన రెండు లక్షల రూపాయలను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్టు చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై వచ్చిన వడ్డీ సొమ్ముతో ఆలయ జీర్ణోర్ధరణ పనులు, నిత్య కైంకర్య సేవలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో కొన్ని బంగారు ఆభరణాలు విజయవాడ వన్‌టౌన్‌లోని వస్తల్రత సమీపంలోని ఎస్.బి.ఐ బ్రాంచి లాకర్లలో, స్వామివారి వెండి ఊయ్యాలకు చెందిన వెండి గొలుసులు, ఇతర వెండి సామాగ్రిని ఆగిరిపల్లి ఆంధ్రాబ్యాంక్ లాకర్‌లలో ధర్మకర్తల ఆధ్వర్యంలో ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా స్వామి వారి ఆభరణాలు గోల్‌మాల్ అయ్యాయంటూ గ్రామంలో శుక్రవారం వదంతులు వ్యాపించాయి.
అయిదు కోట్ల రూపాయల విలువైన ఆభరణాల పరిిస్థితి ఇలా ఉంటే..స్వామి వారిని కనులారా చూసుకునే భాగ్యం భక్తులకు 4 సంవత్సరాలుగా కరువైంది. స్వామివారి స్వర్ణాభరణాలు, విలువైన వస్త్రాలను కారణం లేకుండానే 2006 జూలై 18వ తేదీన ఆలయంలో ఉన్న గదుల్లో బీరువాల్లో ఉంచి తాళం వేశారు. నివేదన కోసం వినియోగించే వంట సామాగ్రిని ఆలయంలోని వరదరాజు స్వామి వార్ల గదిలో మరో రెండు బీరువాల్లో ఆనాటి ఆలయం ఇ.వో తాతా వీరాస్వామి సమక్షంలో సీజ్ చేశారు. దీనిలో విలువైన ఆభరణాలు ఉన్నట్టా...! పోయినట్లా అన్న ప్రశ్న ప్రజల్లో చర్చశనీయంగా మారింది.
News Posted: 29 August, 2009
|