'కృష్ణుడు మిథ్య కాడు' ముంబై : కృష్ణుడు ఉన్నాడా? ఉన్నాడని న్యూక్లియర్ మెడిసిన్ ఫిజీషియన్ మనీష్ పండిత్ ఘంటాపథంగా చెబుతున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ లో అధ్యాపకుడుగా ఉన్న మనీష్ పండిత్ తన వాదనను సమర్థించుకుంటూ ఖగోళ, పురావస్తు, భాషాశాస్త్ర, మౌఖిక పరమైన దాఖలాలను పేర్కొంటున్నారు. 'కృష్ణుడిని హిందూ పురాణాలలో మాత్రమే ఉన్నట్లుగా నేను భావిస్తుండేవాడిని. యుఎస్ టెన్నెస్సీలోని మెంఫిస్ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ నరహరి ఆచార్ తో నేను 2004, 2005 సంవత్సరాలలో మాట్లాడినప్పుడు, ఆయన పరిశోధన గురించి తెలుసుకున్నప్పుడు నేనెంత ఆశ్చర్యపోయానో ఊహించుకోండి. ఖగోళ శాస్త్రాన్ని ఉపయోగించి ఆయన మహాభారత యుద్ధం తేదీలను నిర్థారించారు. నేను వెంటనే మామూలు ప్లానెటోరియం సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఆయన పరిశోధన ఫలితాలు నిజమో కాదో తేల్చుకునేందుకు ప్రయత్నించాను. నాకూ అవే ఫలితాలు లభించాయి' అని పండిత్ వివరించారు.
అంటే, భారతీయ చరిత్ర గురించి పాఠశాలలలో బోధిస్తున్నది నిజం కాదన్నమాట. పాండవులకు, కౌరవులకు మధ్య కురుక్షేత్రంలో యుద్ధం క్రీస్తు పూర్వం 3067 సంవత్సరంలో జరిగిందని పండిత్ 'కృష్ణ: హిస్టరీ ఆర్ మిథ్?' (కృష్ణుడు: చరిత్ర పురుషుడా లేక మిథ్యా మనిషా?) అనే తన తొలి డాక్యుమెంటరీలో తెలియజేశారు. పుణెలో జన్మించిన పండిత్ ఆ నగరంలోని బిజె వైద్య కళాశాల నుంచి ఎంబిబిఎస్ పట్టా పొందారు.
పండిత్ లెక్క ప్రకారం, కృష్ణుడు క్రీస్తు పూర్వం 3112లో జన్మించాడు. అందువల్ల కురుక్షేత్ర యుద్ధం సమయానికి కృష్ణుడికి 54, 55 సంవత్సరాల వయస్సు ఉండి ఉండాలి. పండిత్ సుప్రసిద్ధ జ్యోతిష్కుడు కూడా. సోనియా గాంధి ప్రధాని పదవిని తిరస్కరించగలరని, కంచి కామకోటి పీఠం శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి బెయిల్ పై ఎప్పుడు విడుదల అవుతారనేది, కార్గిల్ యుద్ధం గురించి జోస్యం చెప్పానని పండిత్ తెలిపారు.
News Posted: 29 August, 2009
|