విద్యుత్ కష్టాలకు చెల్లు చీటీ హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు చెల్లుచీటీ ఇచ్చే అనుకూల వాతావరణం కనిపించింది. రెండు ప్రధాన జలాశయాల్లో నీరు నిల్వలు పెరగడమే ఇందుకు కారణం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్ కోతలతో ప్రజలు కాలం వెళ్ళదీస్తున్నారు. రైతులకు విద్యుత్ బాధలు సరేసరి. ఎగువ కర్నాటకలో వరదనీరు జూరాల, శ్రీశైలం రిజర్వాయర్ లకు చేరుతోంది. ఈ ప్రవాహం ఇంకొన్నిరోజులు ఉండే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ లోని జూరాల రిజర్వాయర్ సామర్థ్యం 1045 అడుగులు కాగా 1040 అడుగులకు చేరింది. దీంతో సాగుకు నీరు విడుదల చేసేందుకు 11 గేట్లు ఎత్తేసిన అధికారులు, విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించారు. జూరాలలో 39 మెగావాట్ల సామర్థ్యం గల ఆరు యూనిట్లు రోజుకి 234 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం రెండు యూనిట్లు పని చేస్తున్నాయి.
జూరాల నుంచి మిగులు నీటిని శ్రీశైలం రిజర్వాయర్ కు విడుదల చేస్తున్నారు. ఇక్కడ రిజర్వాయర్ సామర్థ్యం 885 అడుగులు కాగా, 862 అడుగుల వరకు నీరు చేరింది. ఫలితంగా ఇక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. రోజుకి 8000 మెగావాట్లు విద్యుత్ వినియోగం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ డిమాండ్ ను తట్టుకోవడానికి ఏకైక మార్గం విద్యుత్ ఉత్పత్తే. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో మొహం చాటేసిన వరుణుడు 'చల్లని' చూపులు చూడడంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది. మొన్నటి వరకు 'అసమ్మతి' ప్రకటించిన వరుణుడు తిరిగి సీఎం వైఎస్ వినతికి 'సమ్మతించాడు'!
News Posted: 29 August, 2009
|