అద్వానీ నిష్క్రమణే లక్ష్యం! న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో నాయకత్వం మార్పు ఖాయంగా కనిపిస్తోంది. భాజపా సీనియర్ నాయకుడు అద్వానీకి క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమణ అనివార్యం అవుతోంది. శుక్రవారం జరిగిన విలేఖరులు సమావేశంలో 'భారతీయ జనతా పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని ఆ పార్టీయే చక్కదిద్దుకోగలదు' అని వ్యాఖ్యానించిన రాష్ట్రీ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ 'కోరితే సలహా ఇస్తామని' కూడా చెప్పారు. పార్టీ వ్యవహారాల్లో ఏనాడూ తాము జోక్యం చేసుకున్నట్లు ఆర్ఎస్ ఎస్ చెప్పలేదు! 'సంఘ్' అభిప్రాయాన్ని అర్థం చేసుకున్న అద్వానీ అంతరంగికులు అరుణ్ జెట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, అనంత్ కుమార్ లు శుక్రవారం రాత్రి రెండు గంటలకు పైగా మోహన్ భగవత్ తో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా 'త్వరలో వారసునిని ఎన్నుకోవాలని' వీరికి భగవత్ మార్గదర్శనం చేశారని సమాచారం. అద్వానీని సగౌరవంగా సాగనంపేందుకు మార్గాన్ని, అవకాశాన్ని ఇవ్వాలని ఈ సమావేశంలో వారు భావించినట్లు తెలుస్తోంది. అయితే భాజపా మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, నాయకత్వం మార్పు అంశం చర్చకు రాలేదని చెప్పారు. కాగా అద్వానీ శనివారం భగవత్ తో సమావేశం అయ్యే అవకాశాలున్నాయి.
మెహన్ భగవత్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భాజపా నాయకత్వం మార్పిడి అవసరమని చెప్పారు. ఏ సంస్థకైనా మార్పు సహజమని చెప్పారు. పార్టీ నాయకత్వానికి 55 నుంచి 60 ఏళ్ళ మధ్య వ్యక్తి అయితే బాగుంటుదని ఆయన అభిప్రాయపడ్డారు. భాజపాను గాడిలో పెట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు హరిద్వార్ లో ఆర్ఎస్ ఎస్ సమావేశం కానున్నదని తెలిసింది. జిన్నా వివాదం గురించి మోహన్ భగవత్ మాట్లాడుతూ, దేశ విభజనకు జిన్నాయే కారణమని సంఘ్ భావిస్తోందన్నారు. సంఘ్ పరివార్ అజెండాకు అనువుగా నాయకత్వ సమస్యను లేవనెత్తిన 'అరుణ్ శౌరీ'ని గౌరవనీయ వ్యక్తిగా అభివర్ణించారు.
2006లో పాకిస్తాన్ పర్యటనలో జిన్నా దేశ భక్తుడని వ్యాఖ్యానించినప్పటి నుంచి అద్వానీని వివాదాలు చుట్టుముట్టడం ప్రారంభమైంది. జశ్వంత్ సింగ్ పుస్తకం నేపథ్యంలో మరోసారి అద్వానీ నాయకత్వం చర్చకు వచ్చింది. కాందహార్ బందీల అప్పగింతకు తోడుగా 'ఓటుకు నగదు' వ్యవహారానికి అద్వానీయే మూల కారకుడని కూడా ఆరోపణ చేశారు. ఇంతగా అద్వానీపై ఆరోపణలు గుప్పిస్తున్న పార్టీలో తిరిగి సాధారణస్థితి నెలకొంటుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
News Posted: 29 August, 2009
|