హాట్ లైన్ లో మావోయిస్టులు కోలకతా : సిపిఐ (మావోయిస్టు) పార్టీ హాట్ లైన్ ను ప్రారంభించింది. బహుశా దేశంలో, అసలు ప్రపంచంలోనే ఒక నిషిద్ధ సంస్థ ఇలా చేయడం ఇదే మొదటిసారేమో? మూడు రోజుల క్రితం పని చేయడం ప్రారంభించిన ఈ ఫోన్ నంబర్ కు అప్పుడే ఆసక్తి గల కాలర్స్ నుంచి కాల్స్ రాసాగాయి. 'మా సందేశాన్ని వ్యాపింపచేయడానికి ఈ నంబర్ ను ఉపయోగించుకోవాలని మా ఉద్దేశం. జనంలో మాపై ఫిర్యాదులు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి కూడా దీనిని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం' అని ఈ నిషిద్ధ సంస్థలో రెండవ ర్యాంకులో ఉన్న 51 సంవత్సరాల నేత కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ తెలియజేశారు.
ఎవరైనా ఈ నంబర్ కు ఫోన్ చేస్తే బికాష్ అనే వ్యక్తి సమాధానం ఇవ్వవచ్చు. వచ్చీరాని బెంగాలీలో, హిందీలో లేదా ఇంగ్లీష్ లో అతను సంస్థ సిద్ధాంతానికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా సహనంతో సమాధానాలు ఇస్తాడు. 'ఒకవేళ ఈ నంబర్ ను బ్లాక్ చేస్తే మేము మరొక నంబర్ కు మారతాం' అని కోటేశ్వరరావు చెప్పారు. అయితే, నిషేధాన్నినిరర్థకం చేయడానికి ఏ నిషిద్ధ సంస్థ అయినా ఎన్నడైనా హాట్ లైన్ ను ఏర్పాటు చేసుకున్నదా అనేది సిపిఐ (మావోయిస్ట్) నాయకులలో ఎవరికీ తెలియదు.
ఫోన్ చేసిన ఏ వ్యక్తి అయినా మావోయిస్టు కార్యకలాపాలపై ఫిర్యాదులు చేసినప్పటికీ వాటికి కూడా సహనంతోనే నమోదు చేస్తారు. 'మాకు ఇప్పటికే దాదాపు 50 కాల్స్ వచ్చాయి. వాటిలో కొన్ని ఆసక్తిపరులైన కాలర్స్ నుంచి వచ్చినవే. వారు ఎవరైనా మావోయిస్టుతో మాట్లాడాలని అభిలషిస్తున్నవారు' అని బికాష్ తెలియజేశాడు.
జన బాహుళ్యానికి ఏవిధంగానైనా చేరువలోకి వెళ్ళేందుకు సిపిఐ (మావోయిస్టు) పార్టీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ హాట్ లైన్ ఏర్పాటు అని భావిస్తున్నారు. జన బాహుళ్యంతో సమాచార సంబంధాలు నెలకొల్పుకోవడానికై ఈ పార్టీ గత శీతాకాలంలో 65 సంవత్సరాల గౌర్ చక్రవర్తిని అధికార ప్రతినిధిగా నియమించింది. కాని పార్టీపై నిషేధం విధించిన దరిమిలా జూన్ 22న అతనిని అరెస్టు చేయడంతో సమాజంతో సంబంధాల కోసం పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడింది.
పశ్చిమ బెంగాల్ పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని ఝార్ గ్రామ్, పరిసర ప్రాంతాలలో సిపిఐ (మావోయిస్టు) పార్టీ పేరును ఉపయోగించుకుంటూ కొందరు వ్యక్తులు వాణిజ్యవేత్తలు, కాంట్రాక్టర్ల నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడమే ఈ హాట్ లైన్ ఏర్పాటుకు కారణమని తెలుస్తున్నది. ఈ సమాచారం మావోయిస్టులకు అందినప్పుడు వారు హాట్ లైన్ ను ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. 'ఆతరువాత ఈ నంబర్ పరిధిని విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాం' అని కోటేశ్వరరావు అదే నంబర్ నుంచి మాట్లాడుతూ చెప్పారు.
News Posted: 31 August, 2009
|