భాజపా అగ్రనే'తల' మార్పిడి! న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంలో కొత్త మొహాలు కనిపించడం దాదాపు ఖాయమైంది. మాజీ కేంద్రమంత్రి జశ్వంత్ సింగ్ రాసిన 'జిన్నా జీవిత చరిత్ర' భాజపా నే'తల' రాత మారింది. శుక్రవారం నుంచి ఆర్ ఎస్ ఎస్ అగ్రనేత మోహన్ భాగవత్ తో భాజపా నేతల మంతనాలు ఒక కొలిక్కి వచ్చినట్టే. దీంతో భాజపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు అద్వానీలు నిష్క్రణమించడం తథ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాజ్ నాథ్ సింగ్ రెండోసారి పదవిని చేపట్టబోరని పార్టీ ప్రకటించింది.
ఎల్ కే అద్వానీని సగౌరవంగా సాగనంపడంతో పాటు పునరావాసాన్ని కూడా కట్టబెట్టే అవకాశం ఉంది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డీఎ) ఛైర్మన్ పదవిలో వాజ్ పేయ్ స్థానంలో అద్వానీ నియమితులవుతారు. మరో వైపు అక్టోబర్ లో జరిగే మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల తరఫున అద్వానీ ప్రచారం చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. ఇక రాజ్ నాథ్ సింగ్ స్థానంలో వారసుల ఎంపిక పరిశీలన జరుగుతోంది. ఆయన స్థానంలో అరుణ్ జెట్లీ, వైఎస్ నాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఏ రేసులో లేనని, అద్వానీయే మా పార్టీ నాయకుడని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 2014 లోక్ సభ ఎన్నికలకు ఎవరు సారధ్యం వహిస్తారన్నది సకాలంలోనే నిర్ణయిస్తామని చెప్పారు.
అద్వాని నిర్వహిస్తున్న లోక్ సభలో ప్రతిపక్ష నాయకత్వాన్ని డిప్యూటీ ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ కు అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అద్వానీ తొలి నుంచి చెబుతున్నట్టుగా డిసెంబర్ లోగా నిష్క్రమించే అవకాశం ఉంది. రాజ్ నాథ్ సింగ్ స్థానంలో పార్టీ నేతలను కాకుండా ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్నవారిని నియమించే పక్షంలో గుజరాత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు నరేంద్రమోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్ లకు అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, పార్టీలో వర్గాలకు అతీతంగా కొత్త ముఖాన్ని ఎంపిక చేయాలని ఆర్ ఎస్ ఎస్ భావిస్తోంది. ఇందుకోసం నితిన్ గడ్కారి (మహారాష్ట్ర), బాల్ అఫ్టే (రాజ్యసభ), మనోహర్ పారిక్కర్ (గోవా మాజీ సీఎం), ఎల్ గణేషన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
మహారాష్ట్రలో బిజెపి అధ్యక్షుడుగా ఉన్న గడ్కారీకి శివసేనతో సత్సంబంధాలు ఉన్నాయి. భాజపా ఓటమిపై నివేదిక రూపొందించిన బాల్ అఫ్టే ఆర్ ఎస్ ఎస్ కు సన్నిహితులు. గోవా మాజీ సీఎం మనోహర్ పారిక్కర్ కు మంచి వ్యూహకర్తగా పార్టీలో పేరుంది. దక్షిణాదిలో విస్తరించాలని భావిస్తున్న భాజపా కు ఎల్ గణేషన్ ను ఎన్నుకోవడం మంచి నిర్ణయం కాగలదని కొందరు అభిప్రాయపడుతుతన్నారు. భాజపాలో నాయకత్వం మార్పిడి లేదని, ఆయా స్థానాలు ఖాళీగా లేవని వెంకయ్యనాయుడు వంటి నేతలు ప్రకటించినా... ఆర్ ఎస్ ఎస్ భాజపాను ప్రక్షాళనం చేయాలని భావించిందన్నది నిజం. సంఘ్ సంకల్పం ఫలితాలు త్వరలో రాజకీయ తెరపై కనిపిస్తాయి.
News Posted: 31 August, 2009
|